జగన్‌ విదేశీ పర్యటన.. కోర్టు ధిక్కారమా?

ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటకు వెళ్లడం కోర్టు ధిక్కారం అంటూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించడం సంచలనంగా మారింది. సీఎం జగన్ లండన్‌ వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదని.. కోర్టు అనుమతి లేకుండా లండన్‌ వెళ్లడం అనుమానాలకు తావిస్తోందని టీడీపీ నేత యనమల వ్యాఖ్యానించారు. జగన్ దోచిన సొమ్ము దాచుకునేందుకే లండన్ వెళ్లారని యనమల అన్నారు. అయితే.. యనమల వ్యాఖ్యలను మంత్రులు బుగ్గన, గుడివాడ ఖండించారు. సీఎం దావోస్‌ పర్యటనపై ఉన్మాదుల్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  

టీడీపీ నేతలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తూ రాష్ట్రానికి ముప్పు కలిగిస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. రోజూ సీఎం జగన్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా అనాగరికంగా వ్యవహరిస్తున్నారని మంత్రి బుగ్గన మండిపడ్డారు. ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి ఆరోపణలు దుర్మార్గం.. దారుణం అని మంత్రి బుగ్గన విమర్శించారు. సుదీర్ఘ కాలం మంత్రులుగా పనిచేసి, అనేక విదేశీ ప్రయాణాలు చేసిన వారు కూడా కనీస సంస్కారం లేకుండా దిగజారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కుటుంబంపై విష చిమ్ముతున్నారని మంత్రి బుగ్గన దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి పర్యటన రహస్యం కాదని, కుటుంబ సభ్యులతో కలిసి దావోస్‌ వెళుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందేనని మరో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ రెడ్డి వివరించారు. విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నియమాలు, నిబంధనలు తదితర అంశాలను పట్టించుకోకుండా యనమల సీఎం కుటుంబంపై తప్పుడు ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగిందని.. ఎయిర్‌ట్రాఫిక్‌ విపరీతంగా ఉండడం వల్ల అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యమైందని వివరించారు.

విమానం లండన్‌కు ఆలస్యంగా చేరుకుందని... అక్కడా ఆలస్యం కావడంతో రాత్రి బస అక్కడే ఏర్పాటు చేశారని మంత్రి వివరించారు. తెల్లవారుజామునే జూరెక్‌కు బయలుదేరడానికి పైలెట్లు విశ్రాంతిలో ఉన్నారని.. వాస్తవం ఇదైతే టీడీపీ నాయకులు, ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రులు మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: