జగన్‌కు బొత్స జలక్ ఇచ్చారా? కావాలనే అలా చేశారా?

బొత్స సత్యనారాయణ.. ఏపీలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. వైఎస్ హయాంలోనే కీలకమైన మంత్రి పదవులు నిర్వహించిన నాయకుడు. పీసీసీ అధ్యక్షుడిగా కూడా పని చేసిన నాయకుడు. వైఎస్ హఠాన్మరణం తర్వాత సీఎం రేసులోనూ ఉన్న వ్యక్తి.. అధిష్టానం ముందుగా రోశయ్యను.. ఆ తరువాత కిరణ్‌ కుమార్ రెడ్డిని సీఎంగా నియమించడంతో సీఎం అవకాశం కోల్పోయిన వ్యక్తి.. ఇక జగన్ వైసీపీ పెట్టాక.. ఇంకా కాంగ్రెస్‌లో ఉంటే ఉపయోగం లేదని తెలుసుకుని జగన్ చెంతకు చేరాడు.

అయితే.. తనకంటే ఎంతో జూనియర్ అయిన జగన్ దగ్గర పని చేయడం ఆయనకు తప్పలేదు. అయితే జగన్ మాత్రం బొత్సకు తగిన ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఉత్తరాంధ్ర నేతగా ఆయనకు తగిన గౌరవం ఇస్తున్నారు. అందుకే రెండోసారి కూడా బొత్స సత్యనారాయణకు మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. మొత్తానికి జగన్, బొత్స సంబంధాలు బాగానే ఉన్నాయి. అయితే.. నిన్న ప్రమాణ స్వీకారం సమయంలో ఓ విచిత్రం చోటు చేసుకుంది.

సాధారణంగా ఏ మంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందుగా సీఎంకు.. ఆ తర్వాత గవర్నర్‌కు అభివాదం చేసి వేదిక నుంచి కిందకు వెళ్లిపోతారు. నిన్న కూడా అదే జరిగింది. ప్రతి మంత్రి కూడా ప్రమాణ స్వీకారం తర్వాత నేరుగా సీఎం జగన్ వద్దకు వచ్చి నమస్కారం చేసి.. తర్వాత గవర్నర్ వద్దకు వెళ్లారు. అందుకు అనుగుణంగానే సీటింగ్ ఉంది. ప్రమాణం చేసి వచ్చే వారికి ముందు సీఎం జగన్ దగ్గరగా ఉంటారు. టేబుల్‌కు అటు వైపున గవర్నర్ ఉంటారు కాబట్టి కాస్త దూరంగా ఉంటారు. ముందు సీఎం వద్దకు రావడమే సులభం.

కానీ మంత్రి బొత్స మాత్రం ప్రమాణం తర్వాత సీఎం జగన్‌ను దాటుకుని మరీ ముందు గవర్నర్ వద్దకు వెళ్లి నమస్కారం చేశారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి వచ్చి సీఎంను కలుసుకుని అభివాదం చేశారు. ఇలా చేయడం ఇప్పుడు అనేక ఊహాగానాలకు తావిస్తోంది. బొత్స కావాలనే జగన్‌ను తప్పించుకుని మరీ ముందు గవర్నర్‌కు అభివాదం చేశారన్న వాదన ఉంది. అయితే.. అదేదో యథాలాపంగా జరిగి ఉంటుంది తప్ప.. అందులో మరీ అంత రంథ్రాన్వేషణ అనవసరం అంటున్నారు మరికొందరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: