పాలనలో స్థిరత్వం, పెట్టుబడుల్లో దూకుడు – చంద్రబాబు 2025 రియాలిటీ..!

Amruth kumar
నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడుకు 2025 నిజంగా డిసైడింగ్ ఇయర్ అనే చెప్పాలి. గత ఏడాది జూన్‌లో ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, అప్పటికి రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక గందరగోళం, ఖాళీ ఖజానా, పాలనలో గందరగోళం… ఇవన్నీ ఆయన ముందున్న పెద్ద సవాళ్లుగా నిలిచాయి. ప్రభుత్వ వ్యవస్థను గాడిలో పెట్టడం, విధానాలను సమన్వయం చేయడం, అధికార యంత్రాంగాన్ని రీసెట్ చేయడం వంటి అంశాల్లో తొలి నెలలు గట్టిగానే కష్టపడ్డారు. కానీ 2025కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారింది. ఈ ఏడాది చంద్రబాబు పూర్తిగా ప్రభుత్వాన్ని తన నియంత్రణలోకి తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన పెంచుకుని, వైసీపీ హయాంలో జరిగిన అప్పులు, ఒప్పందాలు, పాలనలోని లోపాలపై సమగ్ర సమీక్ష చేశారు. ముఖ్యంగా అమరావతి విషయంలో స్పష్టమైన దిశగా అడుగులు వేయడం ద్వారా “రాజధాని ఫైల్ క్లోజ్ కాదు” అనే సంకేతాన్ని బలంగా ఇచ్చారు.



ఈ ఏడాది చంద్రబాబు ఫోకస్ స్పష్టంగా కనిపించింది – ఇన్వెస్ట్‌మెంట్స్ & ఇమేజ్ బిల్డింగ్. జనవరి నుంచి గత నెల వరకూ స్విట్జర్లాండ్, సింగపూర్, బ్రిటన్, దుబాయ్ సహా పలు దేశాల్లో పర్యటిస్తూ… “ఆంధ్రప్రదేశ్ అంటే అవకాశాల రాష్ట్రం” అన్న బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో మళ్లీ నిలబెట్టే ప్రయత్నం చేశారు. విశాఖలో నిర్వహించిన CII సదస్సు ఈ ప్రయత్నాలకు మరింత బలం చేకూర్చింది. కార్పొరేట్ ప్రపంచం మరోసారి ఏపీ వైపు చూడటం మొదలైంది. ముఖ్యంగా ఐటీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం చంద్రబాబు స్ట్రాటజిక్ మైండ్‌సెట్‌ను మరోసారి చాటింది. గూగుల్ డేటా సెంటర్‌ను ఏపీకి తీసుకురావడం అంటే మాటలు కాదు – అది ఆయన గ్లోబల్ నెట్‌వర్క్, రాజకీయ చతురతకు ప్రత్యక్ష నిదర్శనం. దీంతో పాటు ఉపాధి, ఉద్యోగాల కల్పనపై తీసుకున్న చర్యలు యువతలో ప్రభుత్వంపై పాజిటివిటీ పెంచాయి. ఇక పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లోనూ చంద్రబాబు ఈసారి భిన్నంగా వ్యవహరించారు. గతంలో లాగే వెంటనే కఠిన నిర్ణయాలు తీసుకోవడం కాకుండా, ఆచితూచి అడుగులు వేస్తూ… వివాదాలకు కేంద్రంగా మారిన నాయకులు తామే సర్దుకునేలా చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇది పరిపక్వ నాయకత్వానికి సూచనగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.



ప్రజా సంక్షేమ పథకాలను క్రమంగా అమలు చేస్తూనే, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే కమ్యూనికేషన్‌పై కూడా చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీంతో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చంద్రబాబు కేవలం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు… అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు. “మేము చంద్రబాబును చూసే ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాం” అని అంతర్జాతీయ సంస్థలు చెప్పడం ఆయనకు పెద్ద ప్లస్. ఈ క్రమంలో ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన ‘బిజినెస్ రిఫార్మర్ – 2025’ అవార్డు ఆయన గ్రాఫ్‌కు ముద్ర వేసినట్లైంది. మొత్తం మీద 2025లో సీఎం చంద్రబాబు నాయుడు తన నాయకత్వ గ్రాఫ్‌ను స్పష్టంగా పెంచుకున్నారు. పాలనలో స్థిరత్వం, పెట్టుబడుల్లో దూకుడు, ఇమేజ్‌లో పునర్నిర్మాణం – ఇవన్నీ కలిసొచ్చిన సంవత్సరం ఇదని రాజకీయ వర్గాలు అంగీకరిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: