కేసీఆర్ వ్యూహాలే బలహీనమయ్యాయా? 2025లో బీఆర్‌ఎస్ వెనుకబాటుకు కారణాలివే!
1) ఉన్న సీటునే కోల్పోయిన షాక్ :
2023లో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరమవడం ఇప్పటికే పెద్ద దెబ్బ. దీనికి తోడు 2025లో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పార్టీకి మరింత షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌లో పార్టీకి ఉన్న బలమైన సీటును కోల్పోవడంతో, “నగర రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పట్టుసడలిందా?” అన్న చర్చ మొదలైంది. ఇది కేవలం ఒక సీటు ఓటమి కాదు… పార్టీ మోరల్‌పై పడిన పెద్ద దెబ్బ.
2) సొంత ఇంట్లోనే చిచ్చు :
కేసీఆర్ కుటుంబంలోనే రాజకీయ కలకలం బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచింది. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు, ‘డియర్ డాడీ’ లేఖ, కేసీఆర్‌ను దేవుడితో పోల్చి చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న వ్యాఖ్యలు పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టాయి. ఈ కుటుంబ వివాదం పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టించింది. దీని ప్రభావం ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. బీఆర్‌ఎస్ బలంగా ఉన్న జిల్లాల్లోనూ పరాజయాలు నమోదవ్వడం పార్టీ పరిస్థితిని బయటపెట్టింది.
3) కేసీఆర్ వ్యూహ లోపాలు :
పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు అపార అనుభవం ఉంది. కానీ 2023 తర్వాత ఆయన రాజకీయ వ్యూహాలు ఆశించిన స్థాయిలో ఫలించలేదన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఓటమి, కవిత వ్యాఖ్యలపై సరైన కౌంటర్ లేకపోవడం, పార్టీని మాస్ మూవ్‌మెంట్‌గా మళ్లీ నిలబెట్టలేకపోవడం వ్యూహ లోపాలుగా చెప్పబడుతున్నాయి.
4) కేసులతో ఉక్కిరిబిక్కిరి :
2025లో బీఆర్‌ఎస్‌ను కేసులు చుట్టుముట్టాయి. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కాళేశ్వరం–మేడిగడ్డ ప్రాజెక్టులపై సీపీ ఘోష్ కమిషన్ కేసీఆర్‌ను విచారించి 6000 పేజీల నివేదిక ఇవ్వడం… ఇవన్నీ పార్టీపై ఒత్తిడిని పెంచాయి. ప్రభుత్వ వైఖరి మరింత కఠినంగా ఉండటంతో బీఆర్‌ఎస్ రక్షణాత్మక స్థితిలోకి వెళ్లింది.
5) అయినా అదే బలం :
ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా కేసీఆర్‌కు ప్రజల్లో ఉన్న సింపతి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర ఇప్పటికీ బీఆర్‌ఎస్‌కు ప్రధాన బలం. అయితే 2025లో ఆయన ప్రజల మధ్యకు రాకుండా కేవలం రెండు సార్లు అసెంబ్లీకి, రెండు సార్లు జిల్లాలకు మాత్రమే పరిమితమవడం పార్టీకి మైనస్ అయింది. కేసీఆర్ ప్రజల్లో తిరిగితే పరిస్థితి వేరుగా ఉండేదన్న భావన పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది.
మొత్తానికి… 2025 బీఆర్‌ఎస్‌కు పుంజుకునే సంవత్సరం కంటే, తన బలహీనతలను బహిర్గతం చేసిన సంవత్సరంగా మారిందన్నదే రాజకీయ వర్గాల అంచనా.