అమెరికా, ఇండియాలను తెగవాడేసుకుంటున్న పాక్ ప్రధాని?

పాకిస్తాన్ ప్రధాని మంత్రిని పదవీ గండం  వేటాడుతోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మెడపై అవిశ్వాస తీర్మానం కత్తి వేలాడుతోంది. అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ ఎన్నో ఎత్తులు వేస్తున్నారు. ఇన్నాళ్లూ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన ఇమ్రాన్ ఖాన్.. భాగస్వామ్య పక్షాలను కాదు కదా.. చివరకు సొంత పార్టీ ఎంపీలను కూడా మెప్పించలేకపోయారు. అందుకే ఆయనకు ఇప్పడు ఓటమి తప్పదన్న విషయం అర్థమైంది.

అయితే ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు ఇమ్రాన్ ఖాన్‌ ఇప్పుడు ఇండియా, అమెరికాలపై పడుతున్నారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అమెరికాను ఉద్దేశిస్తూ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రష్యా పర్యటనలో భాగంగా పుతిన్‌ను కలిసినందుకు భారత్‌కు మద్దతిస్తున్న శక్తివంతమైన దేశం తనపై కోపంగా ఉందని ఇమ్రాన్‌ఖాన్‌ అనడం వివాదాస్పదం అవుతోంది. పాకిస్తాన్ జాతీయ భద్రతా సమావేశంలో మాట్లాడిన ఇమ్రాన్‌ఖాన్‌ ప్రతి దేశానికి స్వతంత్ర విదేశాంగ విధానం కీలకమని అంటున్నారు.

స్వతంత్ర విదేశాంగ విధానం లేని దేశం తన ప్రజల ప్రయోజనాలను కాపాడలేదని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. విదేశీ సహాయం కోసం ఆయా దేశాల అభీష్టానికి లొంగిపోకుండా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవాలంటున్నారు ఇమ్రాన్‌. ఇటీవల తన రష్యా పర్యటన పట్ల పాకిస్తాన్‌పై అమెరికా అసంతృప్తితో ఉందంటున్న ఇమ్రాన్ ఖాన్.. అదే అమెరికా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు మాత్రం మద్దతు ఇస్తోందని అంటున్నారు.

ఇమ్రాన్ ఖాన్‌ గత ఫిబ్రవరి 24 న రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి  ఇమ్రాన్‌ఖాన్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం అయిన రోజే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రకటించింది. దాడులు ప్రారంభించింది. మొత్తానికి అవిశ్వాసం ద్వారా తన పదవి పోవడం  ఖాయమని తేలిపోవడంతో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్.. అమెరికా, ఇండియాలపై విమర్శల ద్వారా తన పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు.. పాపం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: