పీకల్లోతు కష్టాల్లో ఇమ్రాన్‌ఖాన్‌.. క్లీన్‌బౌల్డ్‌ తప్పదా?

పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర రాజకీయ ఇబ్బందుల్లో ఉన్నారు.. పదవీ కాలం పూర్తి కాకుండానే రాజీనామా చేస్తారా.. స్వచ్ఛందంగా పదవి నుంచి తొలగిపోతారా.. ముందస్తు ఎన్నికలకు వెళ్తారా.. అన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రభుత్వం అవిశ్వాసం తీర్మానం ఎదుర్కొంటోంది. ప్రతిపక్ష పార్టీలు జాతీయ అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశ పెట్టాయి. ఈ అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్‌ 3న ఓటింగ్ జరగబోతోంది. అంటే ఇమ్రాన్ ఖాన్ రాజకీయ భవితవ్యం మరో రెండు, మూడు రోజుల్లో తేలిపోనుంది.

మరి ఈ అవిశ్వాస తీర్మానంపై ఇమ్రాన్‌ ఎంత వరకూ నెగ్గుతారా.. అసలు పరిస్థితి ఏంటి.. ఆయనకు అనుకూలంగా ఎంత మంది ఉన్నారు.. ప్రతికూలంగా ఎంత మందిఉన్నారు అనే లెక్కలు చూస్తే మాత్రం ఇమ్రాన్‌ ఖాన్ క్లీన్ బౌల్డ్ ఖాయం అనే అనిపిస్తోంది. ఎందుకంటే.. సొంత ప్రభుత్వంలోని మంత్రులు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీన్ ఇలా ఉంది కాబట్టే ఆయన జాతీయ అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోవడం దాదాపు అసాధ్యం అంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు.

ఇక లెక్కలు చూస్తే.. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో మొత్తం సీట్లు 342. గత ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పీటీఐకి 149 సీట్లు వచ్చాయి. అతి పెద్ద పార్టీగా అవతరించినా పూర్తి మెజారిటీ మాత్రం రాలేదు. అందుకే ఆయన చిన్న పార్టీల సాయంతో సంఖ్యా బలం 176కు పెంచుకుని అధికారం దక్కించుకున్నారు. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వంలో కొద్దిరోజులకే లుకలకలు మొదలయ్యాయి. ఇప్పుడు ఇమ్రాన్ తన పదవి కాపాడుకోవాలంటే..  172 మంది సభ్యుల మద్దతు సంపాదించుకోవాలి.

ప్రస్తుతం పీటీఐకి 155 సీట్లు, ఎంక్యూఎంపీకి  7 సీట్లు, పీఎంఎల్‌(క్యూ)కి  4.. ఇలా మొత్తం  171 సీట్లు ఉన్నాయి. అయితే.. సొంత పార్టీ నుంచి 24 మంది ఎంపీలు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే ఆయన నెగ్గడం దాదాపు అసాధ్యం. అందుకే విశ్వాస పరీక్షకు ముందే ఆయన రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: