పవన్ కల్యాణ్: నమస్కారాలతో పవన్‌ వెరైటీ రికార్డ్‌?

ఏదైనా సభలో మాట్లాడే ముందు.. వేదికపై ఉన్నవారికి నమస్కారం పెట్టడం సభా సాంప్రదాయం.. సాధారణంగా  ఓ సభలో ఎవరు ముందు మాట్లాడినా ఈ పని చేస్తుంటారు. అయితే.. ఇది వినేవాళ్లకు చాలా విసుగ్గా ఉంటుంది. అది కాకుండా ఇదో తంతు తరహాగా కనిపిస్తుంది. తప్పనిసరి వ్యవహారం అనిపిస్తుంది. అందుకే కొందరు సింపుల్‌గా సభకు నమస్కారం అని సరిపెట్టిసి.. అసలు ప్రసంగంలోకి వెళ్లిపోతారు.

తాజాగా గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్.. ఓ సరికొత్త రికార్డు సృష్టించారని చెప్పాలి. ఈ ఆవిర్భావ దినోత్సవ సభ వేదికపై నుంచి  పవన్ కల్యాణ్ చెప్పిన నమస్కారాలు ఓ రికార్డుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే.. ఆయన వేదికపై ఉన్నవారికే కాకుండా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ నేతలందరికీ నమస్కారాలు చెప్పుకుంటా వచ్చారు. ఇప్పటంలో ఆవిర్భావ దినోత్సవ సభలో వేదిక ఎక్కిన పవన్ కల్యాణ్ ఓ ముప్పావు గంట పాటు అసలు విషయంలోకి రాకుండా అందరికీ నమస్కారాలు పెట్టేందుకే కేటాయించారు.

అన్న నాగబాబుతో మొదలు పెట్టిన పవన్ నమస్కారాల ప్రక్రియ అరగంటకు పైగా సాగింది. రాజకీయాలపై అవగాహన కల్పించిన నాగబాబుకు నమస్కారాలు తెలిపారు పవన్ కల్యాణ్.. ఆ తర్వాత గెలిచినా.. ఓడినా ప్రయాణం మీతోనే అన్న మనోహర్‌కు నమస్కారాలు పెట్టారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్ కల్యాణ్ టీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్‌ లకు కూడా నమస్కారాలు చెప్పేశారు. తెలంగాణ సంస్కృతిలో అలయ్‌ బలయ్‌ ఓ భాగం అన్న పవన్ కళ్యాణ్‌ దాన్ని పరిచయం చేసిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు నమస్కారం తెలిపారు.
అలాగే బీజేపీనేతలు సోమువీర్రాజు, బండి సంజయ్‌కు నమస్కారాలు చెప్పారు. ఉభయరాష్ట్రాల కాంగ్రెస్‌, వామపక్షాల నాయకులకు నమస్కారాలు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా నమస్కారం పెట్టిన పవన్.. చివరకు వైసీపీ నేతలు, కార్యకర్తలకు కూడా పవన్ నమస్కారాలు పెట్టారు. వైసీపీలో బూతులు తిట్టే నేతలే కాదు.. మంచి నాయకులూ ఉన్నారని పవన్‌ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: