యూపీ బుల్డోజర్‌ ఫార్ములా.. తెలంగాణలో నడుస్తుందా?

యూపీలో బీజేపీ బంపర్ విక్టరీ దేశవ్యాప్తంగా ఆ పార్టీలో మాంచి జోష్ నింపింది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం.. అందులోనూ దేశ రాజకీయాలను శాసించే రాష్ట్రం.. అలాంటి చోట వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం అంటే మాటలు కాదు.. ఈ ఫీట్ 37 ఏళ్ల తర్వాత యూపీలో యోగి మాత్రమే రిపీట్ చేశారు. యూపీలో ఏ బీజేపీ ముఖ్యమంత్రి కూడా సాధించిన ఫీట్ యోగి ఆదిత్యానాథ్ సాధించారు.

ఇప్పుడు యూపీ విజయాన్ని దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోని ఆ పార్టీ నేతలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఫార్ములాను తమ రాష్ట్రాల్లోనూ ప్రయోగించేందుకు రెడీ అవుతున్నారు. అలాంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.. దక్షిణాదిలో బీజేపీకి కర్ణాటక తర్వాత ఎక్కువ ఆశలు ఉన్న రాష్ట్రం తెలంగాణ.. ఇక్కడ నుంచి గత ఎంపీ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది బీజేపీ.. అంతే కాదు. ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లోనూ బీజేపీ జయకేతం ఎగరేసింది.

మాటలతో మంటలు పుట్టించే నాయకుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఇప్పుడు పార్టీ మాంచి జోష్ మీదనే ఉంది. దీనికి తోడు ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు. బీజేపీపై కేసీఆర్ యుద్ధం కూడా ప్రకటించాడు. ఇటు బీజేపీ కూడా ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు చుక్కలు చూపించాలని ఆరాటపడుతోంది. దీనికి తగ్గట్టు కాంగ్రెస్‌ రోజురోజుకూ దిగజారుతుండటం బీజేపీకి కలసి వస్తోంది.  

అందుకే ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు యూపీ ఫార్ములా అంటే.. బుల్డోజర్ ఫార్ములా.. అంటే ఒక విధంగా మత తత్వాన్ని రెచ్చగొట్టే ధోరణిలోనే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. హిందుత్వ నినాదాన్ని మరింత బలంగా ప్రయోగించి ఓటర్లలో హిందుత్వ బీజాన్ని నాటాలన్నది బీజేపీ నేతల ఆలోచన.. మరి ఆ తరహా రాజకీయం తెలంగాణలో ఫలితాలు ఇస్తుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: