మరో వివాదం: మేడారం వెళ్లని కేసీఆర్

మేడారం జాతర.. తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర.. తెలంగాణలోనే కాదు.. దేశంలోనే జరిగే అతి పెద్ద జాతరల్లో ఒకటి.. కుంభ మేళా తర్వాత ఆ స్థాయిలో భక్తులు హాజరయ్యే జాతర.. అది కూడా ఏటా జరిగేది కాదు.. రెండేళ్లకోసారి వచ్చే జాతర.. అలాంటి జాతరకు సహజంగానే ముఖ్యమంత్రి వెళ్తుంటారు.. గతంలోనూ చాలాసార్లు సీఎం కేసీఆర్ మేడారం జాతరకు వెళ్లారు.. కానీ.. ఈసారి మాత్రం కేసీఆర్ మేడారం జాతరకు వెళ్లలేదు.

అయితే.. సీఎం కేసీఆర్ మేడారం ఎందుకు వెళ్లలేదు అనేదానికి సరైన వివరణ కనిపించదు. పోనీ.. ఆయన వెళ్లకపోవడం పెద్ద విషయం కాకపోవచ్చు..కానీ.. వస్తానని ప్రకటించి రాకపోవడం ఇబ్బందికరంగానే ఉంటుంది. సీఎం కేసీఆర్ మేడారం జాతర చివరి రెండు రోజుల్లో ఏదో ఒక రోజు వస్తారని ప్రగతి భవన్ వర్గాల నుంచే వచ్చిన సమాచారం.. కానీ..ఎందుకనో కేసీఆర్ ఈ ఏడాది మేడారం వెళ్లలేదు. ఆయన వెళ్లకుండానే జాతర ముగిసిపోయింది.

ఇప్పుడు కేసీఆర్ మేడారం జాతరకు వెళ్లకపోవడం కూడా ఓ రాజకీయ అంశంగా మారిపోయింది. ఈ అంశాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు  ఈ అంశాన్ని హైలెట్ చేశారు. చూశారా.. కేసీఆర్ కావాలనే మేడారం రాలేదు. ఆయనకు వచ్చే తీరికలేదు. ముందుగా వస్తానని సమాచారం ఇచ్చి రాకపోవడం సరి కాదు అంటూ ఈ విషయాన్ని హైలెట్ చేశారు. దీన్ని మరో విధంగా టీఆర్ఎస్ తిప్పికొడుతోంది. మా కేసీఆర్ అనేక సార్లు మేడారం జాతరకు వచ్చారు.. మరి మీ మోడీ ఒక్కసారి కూడా రాలేదు కదా అని ఎదురు దాడి ప్రారంభించింది.

అంతే కాదు.. కేంద్రం కుంభమేళా వంటి ఉత్సవాలకు వందల కోట్లు మంజూరు చేస్తూ.. మేడారం జాతరకు కేవలం 2 కోట్లు మంజూరు చేయడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఈ బీజేపీ, టీఆర్ఎస్‌ మాటల యుద్ధం ఇలా సాగుతుంటే.. మరోవైపు కేసీఆర్ ముంబయికి బయలు దేరుతున్నారు.. మరి మేడారం వెళ్లేందుకు సమయం దొరకని కేసీఆర్.. మిగిలిన పనులేమీ ఆపడం లేదని బీజేపీ నేతలు విమర్సిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: