వైసీపీలో ఆయ‌నో షాడో సీఎం.. షాడో హోం మినిస్ట‌ర్‌..!

VUYYURU SUBHASH
సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే కాకుండా అన్నింటా హాట్ టాపిక్ గా మారింద‌నే చెప్పాలి. జ‌గ‌న్ న‌మ్ముతుంది కూడా ఈయ‌న ఒక్క‌డినే అన్న టాక్ బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోయింది. ఇక అటు ప్ర‌భుత్వంలోనూ.. ఇటు పార్టీలోనూ స‌జ్జ‌ల‌దే రాజ్యం అన్న‌ట్టుగా న‌డుస్తోంది. చివ‌ర‌కు సీఎం చెప్పాల్సిన మాట‌లు.. ఆయ‌న పెట్టాల్సిన ప్రెస్‌మీట్లు కూడా స‌జ్జ‌లే పెట్టేసి ప్ర‌భుత్వం, జ‌గ‌న్ త‌ర‌పున వ‌క‌ల్తా పుచ్చుకుని మాట్లాడేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాక‌ముందు నెంబ‌ర్ 2 ఎవ‌రు అంటే విజ‌య‌సాయి పేరు వినిపించేది.. అయితే పార్టీ అధికారంలోకి వ‌చ్చాక మాత్రం అంద‌రి నోటా నెంబ‌ర్ 2 ఎవ‌రు అంటే వినిపించే ఒకే ఒక పేరు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి.
ఇప్పుడు స‌జ్జ‌ల పూర్తిస్థాయిలో చ‌క్రం తిప్పేస్తున్నారు. జ‌గ‌న్ మ‌న‌సులో మాట‌ల‌ను ఆయ‌న ఎలా చెపుతారో ?  కూడా ఆ పార్టీ నేత‌ల‌కే అర్థంకాని ప‌రిస్థితి. తాజాగా ఉద్యోగ సంఘాలు నిన్న బెజ‌వాడ‌లో క‌దం తొక్కాయి. అక్క‌డ వాళ్లంతా జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌డం కంటే స‌జ్జ‌ల‌నే ఎక్కువుగా టార్గెట్ చేశారు. వాడెవ్వ‌డు.. వీడెవ్వ‌డు స‌జ్జ‌ల గాడెవ్వ‌డు అంటూ స‌జ్జ‌ల‌ను టార్గెట్ చేస్తూ పాట‌లు కూడా పాడారు. స‌జ్జ‌ల ప్ర‌భుత్వంలోనూ, పార్టీలోనూ త‌న‌కు సంబంధం లేని విష‌యాల్లో కూడా ఆయ‌న జోక్యం చేసుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు ఆయ‌న‌పై తీవ్రంగా వినిపిస్తున్నాయి.
పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వంలో మొత్తం సలహాదారులు దాదాపు అరవై మందికి పైగా ఉంటే ఒక్క సజ్జల మాత్రమే దానికి న్యాయం చేకూరుస్తున్నారా ? ఆయ‌న‌దే డామినేష‌నా ?  మ‌రి మిగిలిన స‌ల‌హాదారులు ఏమైపోయారు ? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్లు లేవు. పార్టీలో ఎవ‌రికి అయినా ఒక ప‌ద‌వి ఇవ్వాల‌న్నా.. ప్ర‌భుత్వంలో ఒక‌రికి ప‌ద‌వి రావాల‌న్నా కూడా నిర్ణ‌యించేది స‌జ్జ‌లే అంటున్నారు.
ముఖ్యంగా ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల‌పై కేసులు పెట్టే విష‌యంలో స‌జ్జ‌ల ఒత్తిడి చేసి మ‌రీ పోలీసుల ద్వారా కేసులు పెట్టిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు అయితే తీవ్రంగా ఉన్నాయి. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి సైతం స‌జ్జ‌ల ఆదేశాల‌తోనే త‌న‌పై పోలీసులు కేసులు పెట్టార‌ని ఆరోపించారు. ఇక షాడో సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఆయ‌న ఇటు పోలీసుల‌పై ఒత్తిళ్ల‌తో షాడో హోం మంత్రిగా కూడా మారిపోయార‌న్న చ‌ర్చ‌లు పార్టీ, మీడియా వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఉద్యోగ సంఘాల చర్చలకు, సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధం లేక‌పోయినా కూడా ఆయ‌నే జోక్యం చేసుకుంటున్నారు. ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య సానుకూల వాతావరణం, స‌యోధ్య కోసం మాజీ ఉద్యోగ సంఘాల నేత చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియ‌మించారు. ఈ క‌మిటీలో  బొత్స సత్యనారాయణ - పేర్నినాని - బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఉన్నారు. అయితే వీరిని సైడ్ చేసేసి స‌జ్జలే చ‌క్రం తిప్పేస్తున్నారు. ఏదేమైనా స‌జ్జ‌ల దూకుడు మొద‌టికే మోసం తెచ్చేలా ఉంద‌న్న‌ది నిజం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: