ఇజ్రాయెల్ ప్రధాని అంతమే లక్ష్యంగా ఇరాన్ ఎత్తులు?

Chakravarthi Kalyan
దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ వాతావరణం కనిపిస్తూనే ఉంది. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది.  హమాస్, హెజ్బొల్లా లక్ష్యంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే వందలాది మంది చనిపోయారు. ఆ మధ్య హెజ్బొల్లా అధినేత నస్రల్లాను హతమార్చి ఆ సంస్థను దారుణమైన దెబ్బతీశారు.


 తాజాగా.. ఇజ్రాయెల్‌కు ఊహించని దెబ్బతగిలింది. ఇప్పటివరకు పైచేయి సాధిస్తూ వచ్చిన ఇజ్రాయెల్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఏకంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాసంపై దాడి చేశారు. ఆయన స్వస్థలం సిజేరియాలో నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత నెతన్యాహును టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఫ్లాష్ బాంబులను ఆయన నివాసంపై విసిరారు.


అయితే.. ఈ రెండు కూడా ఆయన ఇంటి ఆవరణలోనే పడడంతో ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తినష్టం కానీ సంభవించలేదు. అయితే.. ఈ ఘటన జరిగినప్పుడు ప్రధాని నెతన్యాహు గానీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఆ ఇంట్లో లేరు. కాగా.. ఈ ఫ్లాష్ బాంబులను ఎవరు విసిరారు..? ఈ దాడికి పాల్పడింది ఎవరు..? అనేది ఇంకా క్లారిటీ రాలేదు.


మిలిటెంట్ గ్రూపులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. హైఫా నగరానికి దక్షిణం వైపుల 20 కిలోమీటర్ల దూరంలో సిజేరియా ఉంటుంది. తరచూ హెజ్బొల్లా ఈ ప్రాంతంపై దాడులు సాగిస్తుంటుంది. నెతన్యాహు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని హైసెక్యూరిటీ జోన్‌గా ప్రకటించారు.


హమాస్, హెజ్బొల్లా లక్ష్యంగా ఇన్నాళ్లు రెచ్చిపోయిన ఇజ్రాయెల్‌కు ఇది ఊహించని పరిణామం అనే చెప్పాలి. గతంలోనే చాలా సార్లు నెతన్యాహుకు బెదిరింపులు వచ్చాయి. చంపేసి తీరుతామంటూ ఆ సంస్థలు ప్రకటించాయి. అయినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా తమ దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు.


అయితే.. నెతన్యాహు ఇంటిపై ఇలా బాంబులను కురిపించడం నెలరోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఈ దాడిపై ఇజ్రాయెల్ సైతం తీవ్రంగా స్పందించింది. నెల రోజుల్లోనే రెండు సార్లు ప్రధాని లక్ష్యంగా చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఈ ఘటనపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: