అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ తన ప్రభుత్వంలో నియామకాలు ప్రారంభించారు. సేవ్ అమెరికా నినాదంతో ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. తొలి నుంచి ట్రంప్ కు వెన్నుదన్నుగా నిలిచిన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి పదవులు ఖరారు చేసారు. ఈ పదవుల ద్వారా ఆ ఇద్దరికీ తాను ఇస్తున్న ప్రాధాన్యం ఏంటో ట్రంప్ వెల్లడించారు.
ట్రంప్ తన పాలనలో పదవుల పైన ఫోకస్ చేసారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు గవర్నమెంట్ ఎఫీషియనెన్సీ డిపార్ట్ మెంట్ కు హెడ్ గా నియమించారు. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామికి సైతం మస్క్ తో పాటుగా ఈ బాధ్యతలు కేటాయించారు. తొలి నుంచి ట్రంప్ విజయం సాధిస్తే మస్క్ తో పాటుగా వివేక్ రామస్వామికి కీలక పదవులు దక్కుతాయని అంచనాలు ఉన్నాయి.
ఈ ఇద్దరు అమెరికన్లు వృథా ఖర్చులు తగ్గించి, ఫెడరల్ ఏజెన్సీలను పునర్ నిర్మిస్తారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేసారు. సేవ్ అమెరికా ఉద్యమానికి ఇవన్నీ కీలకమని చెబుతూ.. తాము హామీ ఇచ్చిన విధంగా పాలనకు మార్గం సుగమం చేస్తారని ట్రంప్ తన సందేశంలో పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ప్రచారం ప్రారంభించన సమయం నుంచి మస్క్ మద్దతుగా నిలిచారు. అదే విధంగా తొలుత పోటీకి సిద్దపడిన వివేక్ రామస్వామి తరువాత ట్రంప్ కు మద్దతు ప్రకటించారు. ప్రచారంతో పాటుగా ఓటర్లను ఆకట్టుకునే విధంగా చురుకుగా వ్యవహరించారు.
ట్రంప్ కోసం మస్క్ భారీగా ఖర్చు చేసారు. ట్రంప్ గెలుపు పైన తొలి నుంచి మస్క్ ధీమాగా ఉన్నారు. అయితే.. ట్రంప్ గెలిచిన తరువాత మస్క్ కు ఇచ్చే పదవి పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మస్క్ కు మాత్రం ట్రంప్ ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తారని భావించారు. ఇప్పుడు కీలకమైన డీఓజీఈ బాధ్యతలను తనకు మద్దతుగా నిలిచిన మస్క్, వివేక్ రామస్వామికి అప్పగిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వరసగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పైన అమెరికన్లతో పాటుగా ప్రపంచ దేశాల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది.ㅤ