రేవంత్ రెడ్డి పై అతిగా ఆధారపడుతున్న కాంగ్రెస్ అధిష్ఠానం? ఇచ్చిన టాస్క్ లో సక్సెస్ అవుతారా..?
మహారాష్ట్ర ఎన్నికలను ఈ సారి పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. జమిలి ఎన్నికల దిశగా అడుగులు పడుతున్న వేళ ఇక్కడ ఫలితం కీలకం కానుంది. కాంగ్రెస్ నుంచి 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా రంగంలోకి దించుతోంది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేతో పాటుగా తెలంగాణ సీఎం రేవంత్ కు బాధ్యతలు కేటాయించింది. భౌగోళికంగా తెలంగాణతో మహా రాష్ట్రకు సరిహద్దు జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో అమలు చేస్తున్న గ్యారంటీలను మహారాష్ట్ర లోనూ హామీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో, తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెంచే బిగ్ టాస్క్ ను కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ కు అప్పగించింది.
మహాయుతి కూటమి, మహా వికాస్ అఘాడి తమ అగ్రనేతలను ప్రచారంలోకి దింపుతున్నాయి.బీజేపీ గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి వ్యూహాలను అమలు చేస్తోంది. బీజేపీ అధినాయకత్వం రాష్ట్రంలో దాదాపు 50 బహిరంగ సభలు ఏర్పాటు చేస్తోంది. ప్రధాని మోదీ, అమిత్షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల మఖ్యమంత్రులు సైతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అమిత్షా 20 ర్యాలీలు, నితిన్ గడ్కరి 40 ర్యాలీలు నిర్వహించనుండగా, దేవేంద్ర ఫడ్నవిస్ 50 ర్యాలీల్లో పాల్గొనేలా నిర్ణయించారు. హర్యానా ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ అనుసరించాలని బీజేపీ భావిస్తోంది. నవంబర్ 20న ఎన్నికలు జరుగనున్నాయి.