బాబూ.. వైసీపీపై కోపంతో పేదలకు అన్యాయం చేయొద్దు?
వాస్తవానికి జగన్ హయాంలో తీసుకున్న ఓ మంచి నిర్ణయాన్ని అడ్డు పెట్టుకొని క్షేత్ర స్థాయిలో నాయకులు ఆడిన నాటకం.. ఆస్తులు పోగోట్టుకున్న వైనం కారణంగా ఆ చేసిన మంచిని చెడగొట్టుకుంటున్నారు. 30 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వాలు భూమిలేని నిరుపేదలకు, చెరువులు.. కుంటలు, పోరంబోకు ఇలా అనేక స్థలాలను గుర్తించి వాటిని అసైన్ చేస్తూ పంచి పెట్టింది. వీటినే అసైన్డ్ భూములు అంటారు. అంటే వీటిని పొందిన వారికి ఎలాంటి హక్కులూ ఉండవు. వాటిని అమ్ముకునేందుకు తనఖా పెట్టేందుకు అవకాశం ఉండదు. దీంతో ఆయా కుటుంబాలకు భూ రక్షణ లేకుండా పోయిందనేది వాస్తవం.
ఈ క్రమంలోనే రెండు దశాబ్దాలుగా తమ భూములను అసైన్డ్ పరిధి నుంచి తప్పించి తమకు హక్కులు కల్పించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీనిపై 2014లో చంద్రబాబు హామీ ఇచ్చినా.. ఆయన చేయలేకపోయారు. 2019లో అధికారం చేపట్టిన జగన్.. వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో 20 ఏళ్లకు పైబడి.. అసైన్డ్ భూములు ఉంటున్నవారికి సర్వ హక్కులు దక్కేలా చేస్తూ జీవో ఇచ్చారు.
వీటిని ఆయా లబ్ధిదారులు అమ్ముకున్నా.. తాకట్టు పెట్టుకున్నా.. స్వేచ్చ కల్పించారు. ఇది మంచి నిర్ణయమేనని నాడు టీడీపీ నేతలు కూడా అభినందించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించి దీనిపై విచారణ చేయాలని ఆదేశించారు. అయితే ఈ జీవోని అడ్డు పెట్టుకొని కొందరు వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు అనేది వాస్తవం. కొందరు బలవంతంగా కూడా పేదల భూములను తీసుకున్నారు. కొంతమంది అమ్ముకున్నారు. కేవలం వీరిని గుర్తిస్తే సరిపోతుంది. అలా కాకుండా మొత్తానికి రద్దు చేస్తే లక్షల మంది పేదలు అన్యాయం అవుతారు. మరి సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.