బాబు, జగన్, పవన్‌: ఏపీని సర్వనాశనం చేస్తున్నారుగా?

Chakravarthi Kalyan
ఏపీలో రాజకీయాలపై రాళ్లు పడుతున్నాయి. ఇదేదో చిన్న విషయం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే పడుతున్న రాళ్లు రాజకీయనేతలపైనే కాబట్టి. సీఎం జగన్ తో ప్రారంభమైన ఈ రాళ్ల రాజకీయాలు.. చంద్రబాబు, జనసేన అధినేత వరకు సాగింది. దీని వెనుక ఎవరు ఉన్నారు? ఎవరు చేస్తున్నారు. నిజంగానే వీరిని టార్గెట్ చేసుకొని వేస్తున్నారా? లేక ఏదో చర్చ పెట్టాలని చేస్తున్నారా? అనే విషయాలు అర్థం కావడం లేదు.

అయితే ఏపీలో ఎన్నడూ లేనంత విద్వేష పూరిత వాతావరణం కనిపిస్తోంది. దీని వెనుక ప్రధానంగా పలు కారణాలు కనిపిస్తున్నాయి. అటు వైసీపీ.. ఇటు టీడీపీ నేతృత్వంలోని కూటమి నేతలు.. పరస్పరం ఎవరికీ వారే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు.  చంద్రబాబుని పశుపతి అని జగన్ అంటే.. జగన్ కనిపిస్తే రాళ్లు వేయండి అంటూ చంద్రబాబు పిలుపునిస్తున్నారు. వీరిద్దరికీ తోడు ఆవేశం స్టార్ పవన్ కల్యాణ్ ఎలాగూ ఉండనే ఉన్నారు.

వైసీపీ అంటే దొంగలు, దోపిడీ దారుల పార్టీ అని టీడీపీ, జనసైనికులు ప్రచారం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు దొంగ పార్టీలని.. వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు అని వైసీపీ నాయకులు తిప్పికొడుతున్నారు. అసలు పార్టీల మధ్య ఉండాల్సిన స్నేహ పూరిత వాతావరణం ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో కనిపించడం లేదు. ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకొని వాటిని పార్టీ కార్యకర్తలకు ఆపాదిస్తున్నారు.

దీంతో వారు ప్రత్యర్థి పార్టీలు కనిపిస్తే చాలు.. రెచ్చిపోతున్నారు. శత్రువుల కంటే దారుణంగా చూస్తున్నారు. ఇప్పుడు రాళ్ల దాడులు దాడి పరస్పరం వ్యక్తిగత దాడులకు దిగే వరకు ఏపీ రాజకీయాలు దిగజారాయి. కల్యాణ దుర్గంలో, మంగళగిరిలో పరస్పరం అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. దాడులు చేసుకున్నారు. ఆయా పార్టీలకు మీడియా అండ ఉండటంతో ఎవరికి వారు అనుకూలంగా వార్తలను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. మొత్తంగా ఏపీ రాజకీయ నేతలు రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: