తెలంగాణలో బీజేపీ ఎంతవరకు పోటీ ఇస్తుంది?

Chakravarthi Kalyan
తెలంగాణ అసెంబ్లీ పోరు ఈ సారి హోరాహోరీగా సాగింది. ప్రధానంగా అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ మధ్య గట్టిపోటీనే నెలకొంది. నువ్వా నేనా అన్నట్లు ఈ రెండు పార్టీలు తలపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఎన్నికల మ్యానిఫెస్టో వరకు టగ్ ఆఫ్ వార్ నెలకొంది. దీంతో ఈ సారి హంగ్ వచ్చే అవకాశాలు లేకపోలేదని పలు సర్వే సంస్థలు  వెల్లడించాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అనూహ్యంగా పోటీలోకి వచ్చింది.

ఓ 23 సీట్లను ఎంపిక చేసుకొని వాటిలో గెలిచి తద్వారా కింగ్ మేకర్ కావాలని భావించింది. అందుకు అనుగుణంగానే చివర్లో ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులతో ప్రచారంలో జోరు పెంచింది.  బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలతో త్రిముఖ పోటీ నెలకొంటుందా..లేక ద్విముఖ పోటీనా.. ఓట్లు చీలిస్తే ఎవరికీ నష్టం అనే లెక్కలు ఆయా పార్టీలు వేసుకుంటున్నాయి.

అయితే అధిక సీట్లలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  దాదాపు 20 సీట్లలోనే త్రిముక పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాంప్రదాయకంగా బీజేపీకి బలమైన సీట్లు ఉన్నాయి. నిర్మల్, కోరుట్ల, ముథోల్, కామారెడ్డి, గజ్వేల్, హైదరాబాద్ లోని కొన్ని సీట్లు, గోషా మహల్ వంటి స్థానాల్లో కచ్చితంగా త్రిముఖ పోటీ నెలకొంటుంది.

ఉదాహరణకు హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు 65వేల ఓట్లకు పైగా వచ్చాయి. అదే ఉప ఎన్నిక సమయానికి వచ్చే సరికి 3వేలకు పడిపోయింది. ఆ పార్టీ ఓటర్లందరూ ఎటు వైపు మళ్లారు.  ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక పవనాల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు బలమైన అభ్యర్థులు మాత్రమే బరిలో నిలుస్తారు. పట్టణాలతో పాటు యువతలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన బీజేపీ బలమైన అభ్యర్థులు ఉన్నచోట మాత్రం పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఓట్ల ప్రభావం కాంగ్రెస్ పై చూపుతుందా.. లేక బీఆర్ఎస్ పై పడుతుందా అంటే డిసెంబరు 3 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: