టీవీ9 వర్సెస్ టీడీపీ.. కేసుల దాకా వెళ్లిందిగా?
ఏపీ విషయానికొస్తే సమస్యలు, అవినీతిపై వార్తలు రాస్తే టీడీపీకి అమ్ముడు పోయిందని ప్రచారం చేస్తుంటారు. అదే సంక్షేమ పథకాల, ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి చెబితే వైసీపీ కొమ్ము కాస్తున్నావని అంటుంటారు. దీనికి ఆధారాలు అవసరం లేదు. ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయవచ్చు. ప్రస్తుతం టీవీ 9 దేవీపై ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఆమె చాలా గట్టిగా ప్రతిఘటించింది. తనపై పోస్టులు పెట్టిన మహాసేన రాజేశ్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఎస్సీ విభాగం స్టీరింగ్ కమిటీ సభ్యుడు మహాసేన రాజేశ్ పై టీవీ9 ప్రతినిధులు ఫిర్యాదు మేరకు విజయవాడలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నెల 1న సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో 368 నంబరు ఎప్ఐఆర్ ప్రకారం 120(బీ), 153, 153-ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీవీ 9 సెక్రటరీ ఏ భాస్కరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
అలాగే టీవీ 9 అసోసియేట్ ఎడిటర్ దేవీ నాగవల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమపై రాజేశ్ దాడులకు పాల్పడుతున్నారని.. మానసిక వేదనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. మీడియా ప్రతిష్ఠను దిగజారుస్తూ.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న వారిపై ఫిర్యాదు చేసిన టీవీ9 యాజమాన్యం, దేవీ నాగవల్లి ధైర్యం చేశారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.