దారుణం : భార్య పుట్టింటికి వెళ్ళిందని.. ప్రాణం తీసిన భర్త?

praveen
చెడు వ్యసనాలకు బానిస గా మారి పోయిన తర్వాత మనిషి ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడడు. ఒక్కసారి  కుటుంబ బాధ్యతలను వదిలేసి గాలికి తిరగడం మొదలు పెట్టిన తర్వాత డబ్బుల కోసం నీచమైన పనులు కూడా చేస్తూ ఉంటాడు అనడానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే పాలు నీళ్ళలా కలిసి మెలిసి ఉంటామని ప్రమాణం చేసి మరీ వివాహం చేసుకుంటారు ఎంతోమంది. కష్ట సుఖాలలో తోడు నీడగా ఉంటాము అంటూ చెబుతూ ఉంటారు. కానీ కష్ట సుఖాల్లో తోడు ఉంటానని చెప్పిన భర్తే ఆమె పాలిట యమకింకరుడిగా మారిపోయాడు.

 ఎనిమిదేళ్ల పాటు ఎంతో సంతోషంగా కాపురం చేసిన భార్య పాలిట భర్త యమకింకరుడు గా మారిపోయి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కాస్త అందరినీ విస్మయానికి గురి చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే భార్యను ఉరివేసి చంపడానికి కారణం తెలుసుకున్న స్థానికులు షాక్ అవుతున్నారు  అని చెప్పాలి  ఈ దారుణ ఘటన నిజాంబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివాహిత హత్య స్థానికులు అందరికీ ఉలిక్కిపడేలా చేసింది. ఆర్మూర్ పట్టణానికి చెందిన స్వప్నకు బోధన్ కు చెందిన లక్ష్మణ్ కు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

 వీరికి ముగ్గురు కొడుకులు కూడా ఉన్నారు. అయితే లక్ష్మణ్ బోధన్ నుంచి ఆర్మూర్ కి వచ్చి కిరాయి ఇంట్లో ఉంటూ తాపీ మేస్త్రి పనులు చేస్తున్నాడు   గత కొంత కాలం నుంచి మద్యానికి బానిసై ఒకవైపు పనికి వెళ్లకపోవడమే కాదు తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. అయితే తల్లి అనారోగ్యం కారణంగా స్వప్న తరచు పుట్టింటికి వెళుతూ వస్తూ ఉండేది. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. తనతో ఉండకుండా పుట్టింటికి వెళుతూ వస్తుండటాన్ని లక్ష్మణ్ తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయి దారుణంగా దాడి చేశాడు. ఆ తర్వాత ఆమె మెడ చుట్టూ ఉరివేసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: