ప్రేమ Vs పరువు: భర్త సుసైడ్‌.. కోడల్ని చంపి మామ సుసైడ్‌ ?

Chakravarthi Kalyan
కాలం మారినా సమాజంలో కుల అంతరాలు మారడం లేదు.. మా కులం కాదు.. అన్న కారణంతో ఇంకా ప్రేమికులను విడదీయడం ఆగడం లేదు. కులం కోసం.. కులం కారణంగా వచ్చిన పరువు కోసం.. చంపేందుకు కూడా వెనుకాడటం లేదు.. తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు కొత్తేమీ కాదు.. అసలు వీటిని పరువు హత్యలు అనకూడదేమో.. పరువు తక్కువ హత్యలు అనాలేమో.. ఇలాంటిదే మరోకథ.. ఓ ప్రణయం.. క్రమంగా పరిణయంగా మారి.. ఆ తర్వాత ప్రళయమై.. మూడు ప్రాణాలను బలిగొన్న కథ ఇది.

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామంలో జరిగిందీ దారుణం.. ఈ గ్రామంలోని సౌందర్య, సాయికృష్ణ అనే ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకున్నారు. తామిద్దరూ ఒక కులం కాదన్న సంగతి తెలిసినా.. ప్రేమకు కులమేంటి అనుకున్నారు. మనసులు కలిశాక.. కులంతో పనేంటి అనుకున్నారు. అవును.. ప్రణయానికి కులంతో పనేముంది.. కులాలు చూసుకుని మనసులు ముడిపడవు కదా.. కానీ.. అది ప్రణయం వరకే.. కానీ ఆ ప్రణయం పరిణయమంగా మారాలంటే.. పెద్దల అనుమతి కావాలి.. కానీ ఆ పెద్దలకు పెళ్లికి కులం కావాలి.

ఇక్కడే వచ్చింది చిక్కు.. కులాలు వేరుకావడంతో ఈ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు.. కానీ.. ఈ కాలంలో పెద్దల అడ్డు చెప్పారని ఆగుతున్న ప్రేమికులెందరు.. అమ్మాయి తరపు వాళ్లు పెళ్లికి ఒప్పుకున్నారు..కానీ అబ్బాయి తరపు నుంచి అంగీకారం లేదు. అయినా సరే.. ప్రేమికుడు సాయికృష్ణ.. సౌందర్యను పెళ్లి చేసుకున్నాడు. పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ప్రేమపెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు.. కానీ ఆ తర్వాత నలువైపుల నుంచి వచ్చే ఒత్తిళ్లు ఎదుర్కోవాలి.. ఆ ధైర్యం లేక.. పెళ్లయిన కొన్నిరోజులకే సాయికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సౌందర్య పుట్టింటి వద్ద ఉంటోంది. తన కొడుకు చావుకు కారణమైందన్న కోపంతో మామ తిరుపతి కోడలిని గొంతు కోసం చంపి పరారయ్యాడు. ఆ తర్వాత ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అలా.. ఓ ప్రణయం పరిణయమై..ఆ తర్వాత పళయమై ముగ్గురి ప్రాణాలు తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: