విద్యార్థినులతో ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన
వివరాల్లోకి వెళ్లితే.. కొమెరెపూరి గ్రామానికి చెందిన షేక్ హుస్సెన్ శాలివాహన్‌నగర్‌లోని ఉర్దూమీడియం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇతను విద్యార్థినులకు నీలి చిత్రాలను చూపించడం, అనుచితంగా ప్రవర్తించడం, లైంగికదాడికి యత్నించడం వంటివి చేస్తున్నాడని విద్యార్థినులు ఉపాధ్యాయునిపై తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించి మాట్లాడారు. ఉపాధ్యాయుడు హుస్సెన్ ను తమకు అప్పగించాలంటూ పోలీస్ స్టేషన్ వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, సీఐ నరసింహారావులు విద్యార్థినుల తల్లిదండ్రులతో చర్చలు జరిపారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు శాంతించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సత్తెనపల్లి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.