బన్ని ఉత్సవ హేలలో ప్రతీకార జ్వాల!

N.Hari
కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టులో ఇటీవల జరిగిన కర్రల సమరంలో పాత కక్షలు బుసలు కొట్టాయి. సాంప్రదాయం పేరుతో జరిగే కర్రల సమరంలో వర్గ వైషమ్యాలు భగ్గుమన్నాయి.ఓ వర్గానికి చెందిన వారిని మరో వర్గం వారు పట్టుడు కర్రలతో గొడ్డును బాదినట్లు బాదారు. ఆ తర్వాత ఇంకోవర్గం వారు ప్రతీకార దాడికి పాల్పడ్డారు. దీంతో ఫ్యాక్షన్‌ నేపథ్యం ఉన్న
దేవరగట్టు పరిసర గ్రామాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది.
దేవరగట్టులో ప్రతియేటా దసరా పండుగ రోజున బన్ని ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. అర్ధరాత్రి మాల మల్లేశ్వర స్వామి కల్యాణం అనంతరం బన్ని ఉత్సవం జరుగుతుంది. ఉత్సవ విగ్రహాలను కొండమీద నుంచి కిందకు తీసుకు వచ్చాక... బన్ని ఉత్సవం మొదలవుతుంది. దీన్నే జైత్రయాత్ర అని కూడా అంటారు. త్రేతాయుగం నుంచి బన్ని ఉత్సవాలు జరుగుతున్నాయని స్ధానికులు చెబుతారు. ఉత్సవ విగ్రహాలను దేవరగట్టులోని సింహాసనం కట్ట నుంచి రక్తపడి ప్రదేశానికి కాగడాల వెలుతురులో తీసుకెళ్తుండగా 11 గ్రామాలకు చెందిన భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు ప్రాణాలు పోయేలా కర్రలతో కొట్టుకుంటారు. ఇదంతా సాంప్రదాయం పేరుతో ప్రతి ఏడాది భక్తులు కర్రలతో కొట్టుకోవడం సర్వసాధారణం అయింది. అయితే ఈ ఏడాది బన్నీ ఉత్సవంలో వ్యక్తి గత కక్షలు పురివిప్పడంతో దాడులకు దారి తీశాయి.
దసరా పండుగ రోజున అర్ధరాత్రి బన్నీ ఉత్సవం ప్రారంభం కాకముందే దేవరగట్టు ఆలయ పరిధిలో ఎల్లార్తి గ్రామానికి చెందిన కొంతమంది ఉద్దేశ పూర్వకంగా కురుకుందకు చెందిన నలుగురి వ్యక్తులపై రింగులు తొడిగిన పట్టుడు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్ర రక్త గాయాలతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే కుప్పకూలారు. ఈ ఘటన తీవ్ర సంఛలనం రేపింది. సీసీటీవి పుటేజ్ ఆధారంగా పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించారు. దాడికి పాల్పడిన ఎల్లార్తి గ్రామానికి చెందిన 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు.
ఇక బన్ని ఉత్సవంలో తమ వారిపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని అరికెరలో ఓ వర్గం వారు మరో వర్గంపై కర్రలతో ప్రతీకార దాడి చేశారు. ఈ రెండు ఘటనలతో దేవరగట్టు పరిసర గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న గ్రామాల్లో అయితే తీవ్ర అలజడి రేకెత్తిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని కర్రల సమరంలో పాల్గొన్న వారిలో టెన్షన్ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: