సమాచార హక్కు చట్టమా.. స్వాహ చట్టమా..!

MOHAN BABU
సమాచార హక్కు కేవలం సమాచారం తెలుసుకునేందుకే కాదు. ప్రభుత్వంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి. పాలనకు సంబంధించి గతంలో రహస్యాలు ఉండొచ్చు. మా ప్రభుత్వంలో ఎలాంటి దాపరికాలు స్థానం లేదు. పారదర్శకత కు ఎంత ప్రాధాన్యం ఇస్తే ప్రజలకు ప్రజాస్వామ్యంపై అంత ఎక్కువ నమ్మకం కలుగుతుంది. దానికోసమే మా ప్రయత్నం. సమాచార హక్కు చట్టం బలోపేతంపై 2015 లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలివి. ఇంకేముంది ప్రజలందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వం, అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసేలా సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేయబోతుందని అంతా ఆశించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా ఆ చట్టం కోరలు పీకే పనికి మోడీ సర్కార్ ఏర్పాట్లు చేస్తుండటం ఆందోళనకరం. ప్రజలు పోరాడి సాధించుకున్న ఈ చట్టం ఆది నుండి అనేక ఆటుపోట్లు మద్యే 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. కానీ ఇప్పుడు బిజెపి ప్రభుత్వం మరింత దూకుడుగా ఈ చట్టాన్ని బలహీనపరిచే కుట్రలకు పాల్పడుతుంది.

స్వాతంత్ర్యానంతరం పౌరుల ప్రాథమిక హక్కుల పై దేశంలో ఎప్పుడూ ఏదో ఒక స్థాయిలో దాడి జరుగుతూనే ఉంది. రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణం భావప్రకటన స్వేచ్ఛను పౌరులకు ప్రాథమిక హక్కుగా నిర్ధారించింది. సమాచార హక్కును చట్ట బద్ధత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో 15 ఏళ్ల క్రితం అప్పటి యూపీఏ ప్రభుత్వం దిగివచ్చింది. 2005 అక్టోబర్ 12న సమాచార హక్కు సంపూర్ణ చట్టబద్ధత కల్పిస్తూ కొత్త అధ్యాయానికి తెర లేపింది. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రజలకు వెల్లడించవచ్చునని,8(1) నిబంధన ప్రకారం పది విభాగాలుగా వర్గీకరించారు వివరాలను మాత్రం నిరాకరించ వచ్చునని ఆ చట్టం లో స్పష్టం చేసింది. అధికార రహస్యాల చట్టం లేదా మరి చట్టాలు, ఇతర నిబంధనల ప్రకారం కూడా పౌరులకు సమాచారం ఇవ్వకుండా నిరాకరించరాదు. సమాచార హక్కు చట్టం ప్రజలకు సాధికారత కల్పించింది. ప్రభుత్వ విభాగాలన్ని జవాబుదారీతనంతో మెలగాల్సిన అవసరాన్ని చాటి చెప్పింది. కానీ దీంతో ప్రజా చైతన్యం వికసించడం ఏలిన వారికి ఇబ్బంది కలిగించినట్టుంది. దాంతో చట్టం తెచ్చిన ఏడాది కాలంలోనే సవరణలు చేసి దాన్ని నీరుగార్చేందుకు 2006లో అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు మిన్నంటడంతో సర్కారు వెనక్కి తగ్గింది. ఆ తర్వాత మరో రెండు సందర్భాల్లోనూ చట్టాన్ని బలహీన పరిచేందుకు ఎక్కడైనా సందు దొరుకుతుందేమో అని చూసిన ప్రభుత్వం - జనాగ్రహం తో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: