క్రికెట్ బెట్టింగులతో యువత బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగుల కోసం వేలు, లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు తీర్చలేక చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే అప్పటి వరకూ మన దేశంలో జరిగే క్రికెట్ మ్యాచ్ లపైనే బెట్టింగ్ లు పెట్టేవారు. కానీ ఇప్పుడు మన దేశంలో జరిగే మ్యాచ్ లపైనే కాకుండా ఇతర దేశాల్లో జరుగుతున్న మ్యాచ్ లపై కూడా బెట్టింగ్ లు వేస్తున్నారు. టెక్నాలజీని మంచి కోసం వినియోగించకుండా ఇలా బెట్టింగ్ ల కోసం వినియోగిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అనేక వెబ్ సైట్ ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఫుడ్ బాల్ మ్యాచ్ లు, క్రికెట్ మ్యాచ్ లపై బెట్టింగ్ లు వేస్తున్నారు.
ఇక తాజాగా హైదరాబాద్ కేంద్రంగా పాకిస్తాన్ లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ పై బెట్టింగ్ లు వేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ...పాకిస్తాన్ లో జరిగే సూపర్ లీగ్స్ కు హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్ లు వేస్తున్నారని అన్నారు. ముఠా లో ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేశాము, ప్రధాన నిందితుడు పరారీ లో ఉన్నారని తెలిపారు. ఈనెల 8 తేదీ నుండి పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభమైందని అన్నారు. నిజాం పేట్ లో ఓ భవనం పై రైడ్ చేస్తే ఈ బెట్టింగ్ వ్యవహారం బయట పడిందని సజ్జన్నార్ తెలిపారు. ముఠాలో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన సోమన్న ఆధ్వర్యంలో ఈ బెట్టింగ్ నడుస్తుందని వెల్లడించారు.
నిందితుల నుండి 20 లక్షల 50 వేల రూపాయల నగదు, 26 మొబైల్స్ , కమ్యూనికేటర్ బోర్డ్ ,,వైఫై రుటర్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సోమన్న ద్వారానే హైదరాబాద్ లో ఉన్న ముఠా క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారని అన్నారు. ఆన్ లైన్ ద్వారా వీరు ట్రాన్సాక్షన్స్ చేస్తూ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారని తెలిపారు. హవాలా మనీ ద్వారా ఈ బెట్టింగ్ నిర్వయించినట్లు విచారణ లో తేలిందని సజ్జన్నార్ అన్నారు. లైవ్ లైన్ గురు, క్రికెట్ మజా, లోటస్, బెట్ 365 ఆన్ లైన్ యాప్స్ ద్వారా బెట్టింగ్ చేస్తున్నారని చెప్పారు. ఈ బెట్టింగ్ అనేది ఎక్కువగా యువకులు, విద్యార్థులు ఆడుతున్నారని చెప్పారు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు పై నిఘా పెట్టాలని కోరారు.