మరోసారి వార్తల్లో నిలిచిన తొండుపల్లి టోల్ గేట్...
తమిళనాడు పోలీసుల సమాచారంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషరేట్ల పరిధిలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. జాయింట్ ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. నగర శివారుల్లోని టోల్గేట్లు, జాతీయ రహదారులపై నిఘా ఉంచారు. నిందితుల వద్ద ఆయుధాలు ఉన్నాయన్న సమాచారంతో సాయుధులైన పోలీసులను మోహరించారు. ఈ రోజు తెల్లవారుజాము సమయంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని తొండుపల్లి టోల్గేట్ వద్ద కారులో వెళ్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం కంటైనర్‌లో వెళ్తోందని సమాచారం ఇవ్వడంతో మేడ్చల్ పరిధిలో కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారీ చోరీ కేసును చాకచక్యంగా ఛేదించిన అనంతరం సైబరాబాద్ సీపీ సజ్జనార్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఏడు కోట్ల రూపాయల విలువైన బంగారం చోరీ కేసును ఛేదించినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేశామని.. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ సిబ్బంది చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారని చెప్పారు.