ఇప్పటికే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్న జనాలు మరో బ్యాడ్ న్యూస్. మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్టు ధరల పెరుగుదల ప్రజల నడ్డి విరుస్తుంది. ఒక వైపు కరోనా వల్ల చితికిపోయిన జనాలు ఈ ధరల పెరుగుదలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం మన నిత్యవసర వస్తువులైన చెప్పులు, బట్టలు, టెక్స్ టైల్స్ ధరలు పెరిగిపోనున్నాయి. ఈ మూడింటి పై జీఎస్టీని 5 శాతం నుండి 12 శాతం వరకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రేట్లు జనవరి నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెక్స్ టైల్స్ పై ఇక నుంచి 12 శాతం జీఎస్టీ వసూలు చేశారు. అప్పారెల్ జీఎస్టీ రేట్లను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత దుస్తుల తయారీ దారుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది.జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జీఎస్టీ కౌన్సెల్ ను కోరామని సంఘం ప్రెసిడెంటు రాజేష్ మసంద్ అన్నారు.
దుస్తుల తయారీకి వాడే నూలు,ప్యాకింగ్, మెటీరియల్, సరకు రవాణా ధరలు పెరిగాయని, ఇన్ఫ్లేషన్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న తమ ఇండస్ట్రీకి ఇది మరో దెబ్బని అన్నారు. జీఎస్టీ రేటు పెరుగుదల లేకున్నా కూడా రాబోయే సీజన్ లో మార్కెట్లో దుస్తుల ధరలు 15 నుంచి 20 శాతం పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి.రూ. 1000 లోపున్న ఫుట్ వేర్ ధరలు బాగా పెరుగుతాయి. భారతదేశ దుస్తుల మార్కెట్ లో 80 శాతానికి పైగా వాటా రూ.1000కంటే తక్కువ ధర కలిగిన దుస్తులదే ఉంటుంది అని ఆయన వివరించారు. టెక్స్ టైల్ ఇండస్ట్రీ లోని ఒక సెక్షన్ కు చెందిన ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ను పరిష్కరించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని సీఎంఏఐ తెలిపింది. ఏ రకంగా చూసినా దుస్తులపై జీఎస్టీ పెంపు తప్పుడు ఆలోచన అని స్పష్టం చేసింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.