తెలంగాణలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. భారీ వర్షాలతో జరిగిన పంట నష్టం కూరగాయల ధరలను 20 నుంచి 50 శాతానికి పెంచేసింది. బెండ కాయ నుంచి బీరకాయ వరకు తోట కూర నుంచి పాలకూర వరకు ఆఖరికి నిత్యం వంటల్లో వినియోగించే పచ్చిమిర్చి అధిక ధరలతో మండిపడు తున్నాయి. ఏ కూరగాయ కొనేటట్టు లేదు, తినేటట్టు లేదు. అసలే కరోనా కారణంగా అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న మధ్యతరగతి జనానికి, ఉపాధి కోల్పోయిన నిరుపేదకు ఈ ధరలు దడ పుట్టిస్తున్నాయి. నెల రోజుల క్రితం వంద రూపాయలకు అన్ని కూరగాయలు దొరికే పరిస్థితి. కానీ ఇప్పుడు వంద రూపాయలకు రెండు మూడు కూరగాయలు కూడా రావడం లేదు.
కిలో బెండకాయ 20 నుంచి 40 రూపాయలు పలుకుతోంది. ఇక బీరకాయ పరిస్థితి అదే బాట. దొండకాయ 20 నుంచి 60 రూపాయలు పెరిగింది. రైతు బజార్ లతోపాటు అటు వారాంతపు మార్కెట్లోనూ ధరలు కొండెక్కి పోతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యుడు మార్కెట్ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ధరలు అమాంతం పెరగడానికి భారీ వర్షాలే కారణం. ఎడతెరిపి లేని కుండపోత వర్షాలకు కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. అరకొర మిగిలిన పంట దెబ్బతింది. దీంతో మార్కెట్ కు కూరగాయల సరఫరా భారీగా తగ్గింది. సాధారణంగా ఆదిలాబాద్, మేడ్చల్, నిజామాబాద్, మహేశ్వరం తో పాటు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ మార్కెట్ కు టమాటో వస్తుంది.అయితే భారీ వర్షాలతో పంట మార్కెట్ కు రావడం కూడా తగ్గింది.
అంతే కాదు నిత్యం మనం దాదాపు ఇరవై ఒక్క రకాల కూరగాయలు వినియోగిస్తుంటే అందులో 16 రకాల కూరగాయలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవే ఉన్నాయి. ఓవైపు రాష్ట్రంలో పంటలు దెబ్బతినడం తో ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయల ధరకు రెక్కలు వచ్చాయి. పరిస్థితిని అదనుగా చేసుకుని దళారులు , వ్యాపారులు మార్కెట్లో కూరగాయల ధరల్ని ఇష్టానికి పెంచేశారు.