అప్పటి వరకు ఉల్లి తిప్పలు తప్పేలా లేదు..!

NAGARJUNA NAKKA

తెలుగురాష్ట్రాల్లో ఉల్లి ధరలు మరో నెల రోజుల పాటు తగ్గేలా లేవు. సంక్రాంతి దాకా ఉల్లి ఇలా మిడిసి పడటం ఖాయంగా కనిపిస్తోంది. డిమాండ్ కు తగినంత సరఫరా లేకపోవడం... కేంద్రం దిగుమతులకు ప్రయత్నిస్తున్నా.. అవి వచ్చేందుకు మరో 15రోజులు సమయం పట్టే అవకాశముండటంతో అప్పటివరకు ఉల్లి తిప్పలు తప్పేలా లేవు. 


ఆకాశానికి చేరిన ఉల్లిధర అప్పుడే కిందకి దిగనంటోంది. డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న జోరులో కిలో ఉల్లి రేటు ... డిమాండ్‌ కు తగ్గ సరఫరా లేని కారణంగా అంతకంతకు పెరుగుతూనే ఉంది. దీంతో ఉల్లి ధర వింటేనే సామాన్యుల గుండె గుబేల్ మంటోంది. తెలుగురాష్ట్రాల్లో ప్రభుత్వాలు సబ్సిడీకి రైతుబజార్లలో ఉల్లి విక్రయాలు జరుపుతుండటంతో భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఉల్లి కొనుగోలు చేసేందుకు రోజంతా పని వదిలేసుకోవాల్సిన పరిస్థితి. 

 

దేశ వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలతో ఉల్లికి తీవ్ర కొరత ఏర్పడింది. రోజువారీ ఉల్లి సరఫరా గత ఏడాది 3 నుంచి 3.5 లక్షల క్వింటాళ్ల మేర ఉండగా.. ఈ ఏడాది 1.17 లక్షల క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో దేశీయంగా ధర అమాంతం పెరిగింది. అయితే ఉల్లి ధరలు పెరగడం, యాసంగికి నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో మహారాష్ట్రలో ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఖరీఫ్‌లో 2.50 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ సీజన్‌లో 4 లక్షల హెక్టార్లకు మించి సాగు అయింది. ఈ దిగుబడులన్నీ జనవరి మాసాంతం వరకు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఆలోగానే కేంద్రం టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటున్న 11 వేల మెట్రిక్‌ టన్నులు, ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకుంటున్న 6వేల మెట్రిక్‌ టన్నుల ఉల్లిగడ్డ విదేశాల నుంచి జనవరి రెండో వారంలోగా దేశానికి పూర్తిగా చేరుకుంటుంది. అప్పటివరకు విదేశాల నుంచి విడతలవారీగా ఉల్లి దేశానికి చేరినా ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది.

 

పదిహేను ఇరవై రోజుల్లో కిలో ఉల్లిధర 80 రూపాయలకు తగ్గే అవకాశం ఉందని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి నాటికి 50 రూపాయలకు తగ్గుతుందని అంచనావేస్తున్నారు. ఇక ఫిబ్రవరిలో మహారాష్ట్ర నుంచి ఉల్లి సరఫరా పెరగనుంది. అలాగే నారాయణఖేడ్, వనపర్తి వంటి ప్రాంతాల నుంచి కూడా మార్కెట్‌కు ఉల్లి వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: