ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మరో హామీని అమలు చేయడం ప్రారంభించింది. అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావొస్తున్న నేపథ్యంలో హామీల అమలుపై.. టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరో హామీని అమలు ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు గానూ పది వేల రూపాయలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. చంద్రబాబు మరో హామీ అమలు చేశారంటూ ఈ మేరకు ఎక్స్ వేదికగా టీడీపీ పోస్ట్ చేసింది. నిధులు లేక ధూప,దీప, నైవేద్యాలకు నోచుకోని ఆరువేల ప్రైవేట్ దేవాలయాలకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 వేల చొప్పున ఇస్తూ వచ్చారు. అయితే ఈ మొత్తాన్ని పది వేలకు పెంచుతామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోపు ఈ మొత్తాన్ని పదివేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ప్రైవేటు దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు రూ.10 వేలు ఇవ్వటం టీడీపీ ప్రభుత్వానికే సాధ్యమని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ అన్నారు. ఆమేరకు జీవో ఇచ్చిన చంద్రబాబుకు ఆయన అర్చక, బ్రాహ్మణ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరులోని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో శ్రీధర్ శర్మ మాట్లాడారు. ‘కనీసం ధూప, దీప, నైవేద్యాలకు కూడా నోచుకోని సుమారు 6,000 దేవాలయాలకు గతంలోనే చంద్రబాబు ప్రభుత్వంలో ఐదు వేలు ఇచ్చారు. ప్రజాగళం పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లోనే దానిని తాజాగా రూ.10 వేలకు పెంచారు. దీనిపై అర్చక సంఘాలు, అర్చకులు, భక్తులు, బ్రాహ్మణ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నాయి.’ అని శ్రీధర్ శర్మ తెలిపారు.మరోవైపు ఏపీ ప్రభుత్వం నిర్ణయం పట్ల అర్చకులు, బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్ దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు పది వేలు ఇవ్వటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారని అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ పలు హామీలను అమలు చేసింది.ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లో పై హామీని ప్రభుత్వం నెరవేర్చిందని పోస్ట్ చేసారు. దీనిపై అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.