జనసేనకు ఇంధనం దిల్ రాజు ధనం.. పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali krishna
రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజుపై ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను థియేటర్లలో చాలా తక్కువగా సినిమాలు చూసేవాడినని.. అయితే, శంకర్ చేసిన జెంటిల్మెన్ సినిమా తమిళంలో బ్లాక్ టికెట్ కొనుక్కుని చూశానని చెప్పారు. ప్రేమికుడు సినిమాకు ఎవరు తోడు లేక తన తల్లిని తోడు తీసుకెళ్లినట్లు తెలిపారు.అంటే అలా అన్ని వయస్సులవారిని ఆకట్టుకునే విధంగా సినిమాలు చేయడం శంకర్ శైలి. ఆయన ఒక సోషల్ మెసేజ్ కూడా సినిమాలో ఇస్తారు. మంచి సినిమాలు చేస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈరోజున భారతదేశంలో రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, చరణ్ కానీ వీరందరికీ ప్రపంచ ఖ్యాతి వచ్చిందన్నారు. ముఖ్యంగా దక్షిణాది నుంచి వారిలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి శంకర్ అని అన్నారు.శంకర్ గొప్ప సినిమాలు చేశారని అన్నారు పవన్ కళ్యాణ్. దిల్ రాజు తాను తొలి ప్రేమ సినిమా చేస్తున్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ అని చెప్పారు. ఎక్కడో పోస్టర్ చూసి ఎవరో చెప్పిన మాట విని ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని తమకు అడ్వాన్స్ ఇచ్చారని తెలిపారు. 

అలా మొదలైన వ్యక్తి తన వకీల్ సాబ్ సినిమాకు నిర్మాత కూడా ఆయనే అయ్యారన్నారు.అలాగే జనసేన పార్టీ నడపడానికి వకీల్ సాబ్ ఇంధనంగా పని చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అలాగే దిల్ రాజు ఎలాంటి నిర్మాత అంటే తాను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు లేనప్పుడు అండగా నిలబడ్డారని చెప్పారు. పేరు ఉంది కానీ డబ్బులు లేవు మార్కెట్ ఉందో లేదో తెలియదు.. అలాంటి పరిస్థితుల్లో వచ్చి వకీల్ సాబ్ అనే సినిమా తనతో తీసి జనసేన పార్టీకి ఇంధనంగా ఆ డబ్బు పనిచేసేలా దిల్ రాజు చేశారంటూ పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.మరోవైపు, తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఛైర్మన్‌గా ఉన్న దిల్ రాజు.. ఆంధ్రప్రదేశ్‌ను తక్కువగా చూడకూడదన్నారు పవన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు సినిమా షూటింగ్స్‌కు తగినట్లుగా ఉంటాయని.. వాటిని ఉపయోగించుకోవాలన్నారు. అలాగే ఇక్కడి యువతకు సినిమా పరిశ్రమ నైపుణ్యాలు నేర్పించాలని కోరారు. ఏపీలో సినిమా షూటింగ్ తోపాటు ఇక్కడ సినీ స్టూడియోలను కూడా నిర్మించాలని పవన్ కోరారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా సహకరిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: