తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అన్ని పార్టీల్లోనూ కొందరు తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చివరి నిమిషంలో సంగారెడ్డి, వేములవాడ అభ్యర్థులను బీజేపీ మార్చడంతో అక్కడ తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. సంగారెడ్డిలో దేశ్‌పాండేను పక్కనపెట్టి పులిమామిడి రాజుకు బీఫామ్ ఇచ్చారు. దీంతో దేశ్‌పాండే సంగారెడ్డిలో స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరోవైపు సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ పటేల్ రమేష్‌రెడ్డి నామినేషన్ వేసారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పటేల్ రమేష్‌రెడ్డి నామినేషన్ వేశారు.
మరోవైపు కొత్తగూడెంలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా జలగం వెంకట్రావు నామినేషన్ వేశారు. అలాగే కాంగ్రెస్ టికెట్ దక్కినా బీఫామ్ దక్కని నీలం మధు బీఎస్పీ అభ్యర్థిగా పటాన్‌చెరు బరిలో దిగారు. వీరు కాకుండా గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్వాసిత రైతులు పరకాలలో ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు. మరి ఈ తిరుగుబాటు అభ్యర్థులు ఎవరైనా సంచలనం సృష్టిస్తారా లేదా అన్నది చూడాలి.