ఏప్రిల్ లో కూడా అడుగు పెట్టకముందే ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో వడగాల్పులు పెరిగిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఇక ఇప్పటికే విద్యార్థుల కోసం ఒంటి పూట బడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఒంటి పూట బడులు కూడా పిల్లలకు కష్టమే అని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. వడగాల్పుల దృష్ట్యా తెలంగాణలో ఒంటిపూట బడుల వేళలలో మార్పులు చేశారు. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకే పాఠశాలలు నడుపుతారు. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలకు వర్తిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంటే ఇది తెలంగాణ విద్యార్థులకు ఊరటగానే చెప్పుకోవచ్చు. అయితే మధ్యాహ్మం 11.30 కూడా కాస్త వేడి ఎక్కువగా ఉండే సమయమే. ఎందుకైనా మంచిది.. పేరెంట్స్ గా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.