26న నాలుగు లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ..!

N ANJANEYULU
కేంద్ర ప్ర‌భుత్వం కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాల్సిందేన‌ని.. లేకపోతే ఆందోళన కొనసాగిస్తామని సంయుక్త కిసాన్‌ మెర్చా నేత రాకేష్‌ టికాయత్‌ హెచ్చరించారు.  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేస్తున్న ఆందోళన దాదాపు సంవ‌త్స‌రం దాటిన‌ది. ఆ వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఇప్ప‌టికే  ప్రధాని నరేంద్ర మోడీ ప్ర‌క‌టించారు. అదే సంద‌ర్భంలో మోడీ  రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే కనీస మద్దతు ధర చట్టం తెచ్చేంత  వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.  కేంద్ర ప్రభుత్వం తన  పద్ధతులను మార్చుకోవాలని, లేనియెడ‌ల‌ జనవరి 26న నాలుగు లక్షల ట్రాక్టర్ల ర్యాలీ ఉంటుందని రాకేష్‌ టికాయత్ హెచ్చ‌రిక‌ జారీ చేసారు.
ముంబైలో జరిగిన రైతుల మహాపంచాయత్‌లో పాల్గొని ఆయ‌న మాట్లాడారు.  ప్రభుత్వం తన ఆలోచన ధోరణి మార్చుకోవాలని,  రైతులను తీవ్రవాదులుగా అభివర్ణించడాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే రైతులపై కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని కూడా సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వ దమనకాండను దాదాపు సంవ‌త్స‌ర కాలం  నుంచి రైతులు భరిస్తూనే ఉన్నారని.. ఇప్పటికైనా తన ఆలోచనా ధోరణి మార్చుకుని క‌నీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేసారు. జనవరి 26వ తేదీన 4 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ ఉంటుందని టికాయ‌త్ వెల్ల‌డించారు.   గ‌తేడాది నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విష‌యం విధిత‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: