తెలంగాణ రాష్ట్ర సమితిని ఇంటి పార్టీ కింద అక్కడ అంతా పరిగణిస్తారు. అదే రీతిలో చాలా మంది ఓటర్లు ఇంకా చెప్పాలంటే మెజార్టీ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని, ఆయన సారథ్య పద్ధతిని ప్రేమిస్తారు. అందుకే ఆయనంటే అందరికీ కాకపోయి నా కొందరికి అయినా లెక్కకు మిక్కిలి గౌరవం. అందుకే ఆయనను తెలంగాణ బాపు అని పిలుచుకుంటారు. ఇప్పుడు హుజురా బాద్ జాతకం ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం అన్నది తేలిపోవడంతో పార్టీలో చీలికలు వస్తాయన్నది ఓ అంచనా! అలానే హరీశ్ రావుకు చెక్ పెట్టడం ఖాయం. ఇవే కాకుండా మరో చర్చ కూడా అప్పుడే తెలంగాణ జాగృతి సభ్యులు కొందరు ఎఫ్బీ వేదికగా చేస్తున్నారు. ఇంటి దొంగలే ఈటెల ను గెలిపించారు అని అంటున్నారు. వీళ్లను గుర్తించడంలోనూ, గమనించడంలోనూ, నిలువరించడంలోనూ పార్టీ అధినాయకత్వం విఫలం అయిందన్నది వాదన. ఇలాంటి తరుణాన తామేం చేయాలో కూడా పాలుపోవడం లేదని, ఈటెలకు కొందరు కోవర్టులే సాయం చేసి పెట్టారని, వీరంతా పార్టీ ద్రోహులు అని ఆరోపిస్తూ మండిపడుతున్నారు తెలంగాణ జాగృతికి చెందిన కొందరు సభ్యులు. మరి నేరం చేసిందెవరు? ద్రోహం చేసిందెవరు?