ఏపీలో బూతుల పంచాంగం?
జెడ్ కేటగిరీ భద్రత ఉన్నా సెప్టెంబర్ 17న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దాడికి తెగబడడం హేయమైన చర్య అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ తీర్మానం మేరకు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖలు పంపుతున్నామన్నారు. రైతు కోసం తెలుగు దేశం కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 10.00 గంటలకు విజయవాడలోని సూరిబాబు పార్క్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు చేపట్టిన నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హెరాయిన్ కేసుల నుంచి ప్రజల దృష్టిని మరలించడానికే జగన్ రెడ్డి మంత్రుల బృందం బూతుల పంచాంగానికి తెరలేపిందని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వ్యవసాయ పంచాంగం, పంచాంగ శ్రవణం ఉంటే ఇప్పటి ప్రభుత్వంలో బూతుల పంచాంగం నడుస్తోందని దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. పవన్‌కల్యాణ్‌పై మంత్రులతోపాటు నటుడు పోసాని కృష్ణమురళి కూడా రాయడానికి వీల్లేని వ్యాఖ్యలు ఉపయోగిస్తూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.