ఆర్టీసీ బస్సులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్... ఆన్ లైన్ లోనే టికెట్ల బుకింగ్...?
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి నెల 22 నుంచి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే కేంద్రం కొన్ని రోజుల క్రితం సడలింపులు ఇవ్వడంతో అధికారులు బస్సులు తిప్పాలని నిర్ణయించారు. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ 18వ తేదీలోపు బస్సులు తిప్పేందుకు సిద్ధంగా ఉండాలని సర్క్యులర్ జారీ చేశారు. లాక్ డౌన్ అనంతరం బస్సుల్లో సీటింగ్ విధానంలో మార్పులు జరగనున్నాయి.
ప్రయాణికులు భౌతిక దూరం పాటించే విధంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సీటింగ్ ను ఏర్పాటు చేయనున్నారు. అధికారులు బస్సులో కేవలం 50 శాతం మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకోనున్నారు. ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటే బస్టాండ్లలో కండక్టర్లు ఆన్ లైన్ లావాదేవీల ద్వారా టికెట్లు బుక్ చేయనున్నారు.