హైదరాబాద్ లో ప్రారంభమైన తొలి వైరాలజీ ల్యాబ్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన కేటీఆర్, కిషన్ రెడ్డి ...!
దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్ లోని ఈ.ఎస్.ఐ ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ ల్యాబ్ వ్యాక్సిన్ తయారీ, వైరస్ కల్చర్, కరోనా పరీక్షలపై పని చేయనుంది. డీఆర్డీవో ఐ సేఫ్, ఐ క్లీన్ సంస్థల సహకారంతో ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేసింది.
వైరాలజీ ల్యాబ్ ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేవలం 20 రోజుల్లో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు 1500 పడకలతో టి.మ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో కేంద్రం మార్గదర్శకాలు అమలవుతున్నాయని చెప్పారు. 8 ప్రత్యేక ఆస్పత్రులను రాష్ట్రంలో కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. కరోనా కట్టడికి హైదరాబాద్‌కు చెందిన వైద్య, శాస్త్రవేత్తల బృందం దేశంలోనే మొదటిసారిగా బహుళ ప్రయోజనకరమైన బయోసేఫ్టీ లెవల్ (బీఎస్‌ఎల్)- 3 వైరాలజీ ల్యాబ్‌ను ఆవిష్కరించింది.
ఈ ల్యాబ్ ను సైనిక అవసరాలకు సైతం ఉపయోగించవచ్చు. ప్రతిరోజు 1000 మందికి నిర్ధారణ పరీక్షలు చేసే సామర్థ్యం దీని సొంతం. ఈ ల్యాబ్ ద్వారా భవిష్యత్‌లో వచ్చే విపత్తుల నుంచి జాగ్రత్త పడొచ్చు. వైరస్ లు వెలుగు చూసిన ప్రాంతాలకు తక్కువ సమయంలోనే ఈ మొబైల్ ల్యాబ్‌ను తీసుకెళ్లి పరీక్షలు చేయవచ్చు