ఫోర్డ్ కంపెనీ డబుల్ గేమ్...!

Podili Ravindranath
భారత్‌లో నష్టమన్నారు... అమెరికాలో మాత్రం భారీ పెట్టుబడులు పెడుతున్నారు. తీవ్ర నష్టాలు వస్తున్నాయంటూ భారత్‌లో ఉన్న తమ ప్లాంట్లను మూసేసింది కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా. కానీ ఇదే సమయంలో అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఫోర్ట్ కార్ల సంస్థ ప్లాన్ చేస్తోంది. 11.4 బిలియన్ డాలర్లతో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే రెండు మెగా యూనిట్లను నెలకొల్పబోతున్నట్లు ఫోర్డ్ సంస్థ ప్రకటించింది. రెండు బ్యాటరీ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. వీటి వల్ల సుమారు 11 వేల మందికి ఉపాధి లభిస్తుందని కూడా ప్రకటించింది. 2030 నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయాలనేదే సంస్థ లక్ష్యమంటూ ఫోర్డ సంస్థ తెలిపింది. భవిష్యత్తులో విద్యుత్ వాహనాలను మాత్రమే తయారు చేయనున్నట్లు ఫోర్డ్ సంస్థ ప్రకటించింది.
అమెరికాలోని టెన్నెస్పెలో కార్ల తయారీ యూట్లు, కెంటకీలో రెండు బ్యాటరీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఫోర్డ్ సంస్థ ప్రకటించింది. దక్షిణ కొరియాకు చెందిన  బ్యాటరీ మేకర్ ఎస్‌కే ఇన్నోవేషన్‌ సంస్థతో కలిసి 11.4 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది. ట్విన్ లిధియమ్-అయాన్ బ్యాటరీల తయారీ ప్లాంట్లను కెంటకీలో ఏర్పాటు చేయనుంది ఫోర్డ్. 3 వేల 600 ఎకరాల్లో కార్ల తయారీ ప్లాంట్ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాటరీ తయారీతో పాటు రీసైక్లింగ్ సెంటర్, సప్లయర్ పార్క్ కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు ఫోర్డ్ సీఈఓ జిమ్ పార్లే. రాబోయే రోజుల్లో బ్యాటరీ కార్ల వాడకం పెరుగుతుందని... అలాగే డీజిల్ కార్ల తయరీని పూర్తిగా నిలిపివేసేందుకు కూడా ఫోర్డ్ ప్లాన్ చేస్తోందని వెల్లడించారు. 2025 నాటికి కొత్త ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయని... వీటి నుంచి ఉత్పత్తిని కూడా అదే ఏడాది మే నెలలో ప్రారంభిస్తామన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ కార్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫోర్డ్ కంపెనీ చరిత్రలోనే ఇది అతి పెద్ద ప్లాంట్ అని... వెల్లడించారు. ఓ వైపు నష్టాలను సాకుగా చూపించి... భారత్‌లోని రెండు ప్లాంట్లను మూసివేసిన ఫోర్డ్ సంస్థ... ఇప్పుడు భారీగా పెట్టుబడులు పెట్టడంపై వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: