ఈ వాహ‌నాలు కొంటే...మీకు జీఎస్టీ భారం ప‌డ‌దు...

Pradhyumna
జీఎస్టీ...ప్ర‌తి దానిపై ఖ‌చ్చితంగా వ‌ర్తించే ప‌న్ను. అయితే, ఆ ప‌న్ను నుంచి మిన‌హాయింపు పొందే అవ‌కాశాలు సైతం వ‌స్తున్నాయి. జీఎస్టీ విష‌యంలో, ప‌ర్యావ‌ర‌ణంలో, నూత‌న పోక‌డ‌ల‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో....కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది. విద్యుత్‌తో నడిచే వాహనాలను కొనుగోలు చేసేవారికి భారీ ఊరటను కల్పించే దిశగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుబోతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీ వేధికగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్‌తో నడిచే వాహనాలపై 12 శాతం జీఎస్టీని విధిస్తుండగా, దీనిని 5 శాతానికి తగ్గించనున్నట్లు తెలుస్తున్నది.


జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న 35వ సమావేశం కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎనిమిది మంది సభ్యులు కలిగిన ఈ కమిటీలో పలు రాష్ర్టాల ఆర్థిక మంత్రులు ఉన్నారు. జీఎస్టీ రిఫండ్‌కు సంబంధించి తలెత్తుతున్న పలు సమస్యలను పరిష్కరించడానికి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు, అలాగే సింగిల్-పాయింట్‌లో క్లియర్ అయ్యే విధంగా చర్యలు ఉంటాయని సంకేతాలిచ్చారు.  రూ.50 కోట్ల కంటే అధిక టర్నోవర్ కలిగిన సంస్థలు విక్రయించేవాటిపై ఖచ్చితంగా ఈ-ఇన్వాయిస్ ఉండాలని, అన్ని సినిమా హాళ్లలో ఖచ్చితంగా ఈ-టిక్కెటింగ్ ఉండాలే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరే అవకాశం ఉంది. అలాగే లాటరీపై విధించే జీఎస్టీ రేటును కూడా నిర్ణయించే అవకాశం ఉన్నది.  వీటితోపాటు లాభదాయక ఆదాయంపై విధించే పన్ను అమలును నవంబర్ 2020 వరకు పొడిగించే అవకాశాలున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న లాటరీలపై 12 జీఎస్టీ విధిస్తున్నారు. దేశీయంగా విద్యుత్‌తో నడిచే వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలనుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాల సూచనప్రాయంగా తెలిపారు. పెట్రోల్, డీజిల్ కార్లతోపాటు హైబ్రిడ్ వాహనాలపై ఇప్పటికే గరిష్ఠంగా 28 శాతం జీఎస్టీతోపాటు సెస్‌ను విధిస్తున్నారు. జాతీయ లాభదాయక ఆథార్టీ(ఎన్‌ఏఏ) అమలు తేదిని నవంబర్ 30, 2020 వరకు పెంచే అవకాశం ఉన్నది. రూ.50 వేలకు మించి రవాణా అయ్యే సరుకుకు ఖచ్చితంగా ఈ-వే బిల్లు ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేయ‌నున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: