విచిత్రం.. 27 ఏళ్లుగా పండ్లు తినే బతుకుతోంది..!

Chakravarthi Kalyan

శ్రీరాముడు మనదేశంలో ఆదర్శ పురుషుడు.. ఆరాధ్య దైవం. ఆ అయోధ్య రామయ్యకు అయోధ్యలో ఆలయం కట్టాలని ఎన్నాళ్ల నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కోర్టు కేసుల కారణంగా అది ఆలస్యమవుతోంది. అందుకే ఈ కేసులు తర్వగా ముగిసిపోయి.. అయోధ్య రామాలయం కట్టాలని మధ్య ప్రదేశ్ లోని ఓ భక్తురాలు కోరుకుంది.


అందుకోసం వింత దీక్ష చేపట్టింది. 27 ఏళ్లుగా ఆహారం తీసుకోకుండా పండ్లను మాత్రమే స్వీకరిస్తూ దీక్ష చేపట్టింది. మధ్యప్రదేశ్ జబల్ పూర్ కు చెందిన ఊర్మిళా చతుర్వేది అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 27 ఏళ్ల నుంచి ఈ దీక్ష నిర్వహిస్తోంది. అయోధ్యలో రాముడికి గుడి కట్టాలనే కోరికతో ఆమె రోజూ నిష్టగా పూజలు చేసేది.


ఇటీవల అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో ఉర్మిళా దేవి ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఎట్టకేలకు తన కోరిక తీరిందంటూ ఆమె దీక్ష విరమించింది. 27 ఏళ్లపాటు ఏకధాటిగా కొనసాగించిన దీక్షను విరమించి ఆహారం తీసుకోవడం ప్రారంభించింది.


ఈ రోజుల్లో వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండాలంటేనే.. జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులోనూ ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటున్నారంటేనే కొండవీటి చాంతాడంత కోరికల జాబితా దేవుడి ముందు ఉంచుతారు. అలాంటిది తన కోసం కాకుండా కేవలం రాముడి కోసం.. ఆయన ఆలయం కోసం 27 ఏళ్లు దీక్ష చేయడం అంటే మామూలు విషయం కాదు సుమా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: