విజయం మీదే: నిరంతరం ఒక విద్యార్థి అని తెలుసుకో ?

VAMSI
జీవితం అనేది ఒక మహాసముద్రం  లాంటిది. ఎన్నో విషయాల సమ్మిళితం. ఎన్నో విషయాలను నేర్చుకుంటూ ఉంటాము. ప్రతి మనిషి వారి జీవితంలో నిరంతర విద్యార్ధే అన్నది అక్షర సత్యం. మనిషి జీవితంలో ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవడానికి  ఎంతో కొంత మిగిలే ఉంటుంది. నేర్చుకోవడం  అంటే కేవలం చదువుకు సంబంధించినవి మాత్రమే కాదు. జీవితంలో ఎదురయ్యే అనుభవాలన్నీ నిరంతరం ఏదో ఒక కొత్త పాఠాన్ని నేర్పుతూనే ఉంటాయి. అందుకే ఎంత పరమ పండితుడు అయినప్పటికీ జీవితం ముందు ఒక విద్యార్ధే అవుతాడు అంటారు పెద్దలు. మనిషి పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు కూడా ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. ఇక ఇదంతా కూడా జ్ఞానం కిందకి వస్తుంది. 

పుట్టినప్పుడు కుటుంబంలో, పెరిగేటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలలో, పాఠశాలలో, కళాశాలలో, పని చేసే దగ్గర, సమాజంలో ఇలా ప్రతి చోటా ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవడం, జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి మనిషి ఎంత నేర్చుకున్నా అపర మేధావి అన్న భావన మాత్రం రాకూడదు అది మన పతనానికి  దారితీస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అని పెద్దలు చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం పీజీలు చేసినా, పెద్ద వ్యాపార వేత్తలగా ఎదిగినా అంతమాత్రాన అంతా మనకు తెలుసు అని అనుకోకూడదు. ఎవరినీ చిన్నచూపు చూడకూడదు.

కొన్నిసార్లు నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉండే ఉంటాయి. అవి సందర్భాన్ని బట్టి బయటపడుతుంటాయి. ముఖ్యంగా సమాజంలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. అందులో నైతిక విలువలు అనేవి ప్రధానమైనవి. ఇతరులను గౌరవించడం, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం, జ్ఞానాన్ని పంచడం ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక ఎంత నేర్చుకున్నా కొత్త విషయాలు తెలుసుకోవాలి అన్న ఉత్సుకత ఉండే వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: