విజయం మీదే : ఈ విషయాలను గుర్తుంచుకుంటే ఇంటర్వ్యూలలో విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

మారుతున్న పోటీ ప్రపంచంలో ప్రతి ఉద్యోగానికి ఇంటర్వ్యూ అనేది ముఖ్యాంశంగా మారింది. కంపెనీలు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల యొక్క సమయస్పూర్తి, వాక్చాతుర్యం, నైపుణ్యాలను అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలతో పోలిస్తే ప్రైవేట్ సంస్థల్లో అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్హతలతో పాటు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తే మాత్రమే ఉద్యోగం సొంతమవుతుంది. 
 
కొన్ని విషయాలను గుర్తుంచుకుని ఇంటర్వ్యూ సమయంలో పాటించడం ద్వారా సక్సెస్ ను సొంతం చేసుకోవడం సులభమే. మనలో చాలామంది ఇంటర్వ్యూలో పేరు, విద్యార్హతలతో మొదలుపెడుతూ ఉంటారు. అలా కాకుండా మన లక్ష్యాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా చెబితే ఇంటర్వ్యూ చేసేవాళ్లకు మనపై సదభిప్రాయం కలుగుతుంది. ఎందుకు ఈ రంగాన్నే ఎంచుకున్నారనే ప్రశ్న ఎదురైతే ఈ రంగాన్ని ఎంచుకోవడం ద్వారా మనం ఏం సాధించాలనుకుంటున్నామో తెలిసేలా చేయాలి. 
 
బలాలు, బలహీనతల గురించి ప్రశ్నలు ఎదురైన సమయంలో మనకు ఉన్న నిజమైన బలాలను మాత్రమే చెప్పాలి. బలహీనతల గురించి అడిగినప్పుడు మనలోని చిన్నచిన్న లోపాల గురించి చెప్పి వాటిని అధిగమిస్తున్నానని చెప్పడం మంచిది. గతంలో పని చేసిన సంస్థ నుంచి ఎందుకు మానేశారని ప్రశ్న ఎదురైతే భవిష్యత్‌లో ఎదుగుదల కోసం ఉద్యోగం మారే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పడం మంచిది. 
 
ఎంత జీతాన్ని ఆశిస్తున్నారనే ప్రశ్నకు మీకున్న ఆలోచనా పరిధిలో కాకుండా ఆ సంస్థలో మీకివ్వబోయే అవకాశాలు, ఆ అవకాశాలకు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న డిమాండ్, ఇతర అంశాల ఆధారంగా సమాధానం ఇవ్వాలి. ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా ఇంటర్వ్యూలలో అవతలి వ్యక్తులకు మనపై సదభిప్రాయం కలగడంతో పాటు సులభంగా ఉద్యోగానికి ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంటర్వ్యూలకు వెళ్లే సమయంలో డ్రస్ విషయంలోను తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పటికే ఆ రంగంలో పని చేస్తున్న వాళ్ల సలహాలు, సూచనలు తీసుకోవాలి. కంపెనీ గురించి కనీస అవగాహన తప్పనిసరిగా ఉండాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: