విజయం మీదే : సమస్యలను ఈ విధంగా పరిష్కరించుకుంటే ఏ పనిలోనైనా సక్సెస్ మీ సొంతం

Reddy P Rajasekhar
మనలో ప్రతి ఒక్కరి భవిష్యత్తు సక్సెస్ పైనే ఆధారపడి ఉంటుంది. అయితే చాలామంది సక్సెస్ సాధించలేకపోవడానికి ఎదురయ్యే సమస్యలే ప్రధాన కారణం. మనకు చిన్న సమస్య, పెద్ద సమస్య ఉంటే చాలామంది చిన్న సమస్య పరిష్కారానికే మొదట ప్రయత్నిస్తారు. ఆ సమస్య పరిష్కారంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, పెద్ద సమస్యను పరిష్కరించగలమో...? లేదో...? అనే భయం పెరిగి చేసే పనిని మధ్యలోనే వదిలేస్తారు.
 
చాలామంది అర్థం లేని ఆలోచనలతో తమను తాము అసమర్థులుగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. అనుభవజ్ఞులు ప్రతి వ్యక్తి జీవితంలో కనీసం మూడు లక్ష్యాలను పెట్టుకోవడం మంచిదని చెబుతున్నారు. మంచి ఉద్యోగం లేదా వ్యాపారం, వివాహ జీవితం ప్రశాంతంగా ఉండటం, భవిష్యత్తులో పిల్లలు ఇబ్బందులు పడకుండా ఇప్పటినుంచే పొదుపు చేయడం లాంటి లక్ష్యాలను పెట్టుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
 
మొదట లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ లక్ష్యాలను సాధించగలమని మనపై మనకు నమ్మకం ఉందా...? లేదా...? పరీక్షించుకోవాలి. అనంతరం లక్ష్యం వల్ల మన జీవితానికి మంచి జరుగుతుందా...? లేదా...? అనే విషయాన్ని ఆలోచించాలి. మనం ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడానికి సమయాన్ని నిర్దేశించుకోవాలి. అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రతిరోజూ లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో కొంత కృషి చేయాలి.
 
లక్ష్యాన్ని సాధించడానికి ఎప్పుడు ఎలా చేస్తే బాగుంటుందో ఒక ప్రణాళిక వేసుకోవాలి. నిజాయితీగా ఆ ప్రణాళికను ఆచరణలో పెట్టాలి. విజయం సాధిస్తే దాని ఫలితం అనుభవించేది మనమే కాబట్టి బద్ధకం విడిచిపెట్టి ముందడుగులు వేయాలి. ఈరోజు చేయాలనుకున్న పనిని ఈరోజే ఎట్టి పరిస్థితుల్లోను పూర్తి చేయాలి. సమస్యలు వచ్చినపుడు చతికిలపడిపోవడం పిరికివారి లక్షణం. ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటూ ముందడుగులు వేస్తే విజయం తప్పక సొంతమవుతుంది. విజయం ఒక నిరంతర ప్రయాణం... మనం సక్సెస్ సాధిస్తే మన విజయాన్ని చాలామంది గుర్తిస్తారు. మనం అసాధ్యాలను ఎలా సుసాధ్యం చేసుకున్నామో గమనిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: