విజయం మీదే : తప్పులను సరిదిద్దుకుంటూ ముందడుగులు వేస్తే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం...?

Reddy P Rajasekhar
మారుతున్న కాలంతో పాటే పోటీతత్వం విపరీతంగా పెరుగుతోంది.  ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని రోడ్లపైకి వస్తున్నారు. సంస్థలు ఉద్యోగులను ఎంపిక చేసుకునే తీరు సైతం మారుతోంది.ఎంతో శ్రమిస్తే మాత్రమే ఉద్యోగం సాధించడం, వ్యాపారంలో సక్సెస్ కావడం సాధ్యమవుతుంది. సక్సెస్ సొంతం చేసుకునే క్రమంలో ఎన్నో సమస్యలు, ఆటంకాలు ఎదురవుతున్నాయి. వాటన్నింటినీ అధిగమిస్తూ ముందడుగులు వేయాలి. కొన్ని సందర్భాల్లో మనం ఎంత శ్రమించినా విజయం సొంతం కాదు. అలాంటి సందర్భాల్లో మనం చేసే తప్పులే మన ఫెయిల్యూర్ కు కారణమవుతాయి.
 
సక్సెస్ సాధించే సత్తా ఉన్నా ఓటమిపాలయ్యామంటే మనం చేసిన తప్పులే కారణం. మరోసారి సక్సెస్ కోసం ప్రయత్నించాలనే ఆలోచన ఉంటే గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వాటిని అధిగమించడానికి శక్తివంచన లేకుండా శ్రమించాలి. మంచి ఉద్యోగానికి ఎంపికనేది ప్రతి విద్యార్థికి సుందర స్వప్నం. పెరుగుతున్న పోటీ నేపథ్యంలో బహుముఖ ప్రజ్ఞావంతులు మాత్రమే ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు.        
 
ఇంటర్వ్యూలు చేసే సంస్థలు సైతం కంపెనీ స్థాయిని పెంచే ఉద్యోగుల కోసమే అన్వేషిస్తున్నాయి. అన్ని రంగాలలో సమర్థతతో పాటు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోగల అభ్యర్థుల కోసమే కంపెనీలు ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తాయి. ఇంటర్వూల్లో ప్రధానంగా భాషా పటిమ, నాయకత్వ లక్షణాలను పరిశీలిస్తారు. ఇంగ్లీష్ ఉచ్చరణ తీరు, వస్త్రధారణ, హుందాతనం, వ్యక్తిత్వం, ఇతర అంశాలను సైతం పరిశీలిస్తారు.
 
సక్సెస్ సాధించాలంటే ఉద్యోగానికి సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు భాషా పటిమ, భావ వ్యక్తీకరణలో స్పష్టత, సూక్ష్మత అవసరం. తొలి ప్రయత్నంలో ఉద్యోగం సాధించక పోయినా మనస్తాపం చెందకుండా పరీక్ష, ఇంటర్వూ తీరును అవగాహన చేసుకుని సక్సెస్ కోసం ప్రయత్నిస్తే విజయం సొంతం చేసుకోవడం సాధ్యమే. మొదటి నుంచే ప్రణాళికాబద్ధంగా నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ మనో ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేస్తే సక్సెస్ తప్పక సొంతమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: