విజయం మీదే : ఇంటర్వ్యూకు వెళుతున్నారా... ఇలా చేస్తే ఉద్యోగం మీ సొంతం..?

Reddy P Rajasekhar
ప్రస్తుత కాలంలో ఏ సంస్థలో అయినా మనం ఉద్యోగం సాధించడం, సాధించకపోవడం ఇంటర్వ్యూలో మనం ప్రదర్శించే నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం పొందాలంటే ఇంటర్వ్యూలో మనం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెప్పామన్నదే కీలకం. కొంతమంది ఎన్ని ఇంటర్వ్యూలకు హాజరైనా భయం వల్ల, కంగారు వల్ల, చిన్నచిన్న తప్పుల వల్ల ఉద్యోగానికి ఎంపిక కారు.
 
చాలా మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో వణుకు, గుండెల్లో దడ వల్ల తెలిసిన ప్రశ్నలకు సైతం సరైన సమాధానాలు చెప్పలేకపోతూ ఉంటారు. ఇంటర్వ్యూలో సక్సెస్ సాధించాలంటే గత ఇంటర్వ్యూల్లో చేసిన పొరపాట్లను పునరావృతం కాకుండా చూసుకోవాలి. భయాలు, ఆందోళనలు లేకుండా ఉద్యోగం సాధిస్తామనే నమ్మకంతో ఉండాలి. ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా మొదట ఇంటర్వ్యూ చేసేవాళ్లు రెజ్యూమ్‌ ను పరిశీలించి అందులోని అంశాల మేరకే ప్రశ్నలు అడుగుతారు.
 
మనం రెజ్యూమ్‌లోని అంశాలు పక్కాగా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల రెజ్యూమ్ ను యథావిథిగా కాపీ కొట్టి లేని నైపుణ్యాలను కూడా ఉన్నట్టు పేర్కొంటే ఇంటర్వ్యూలో సక్సెస్ సాధించడం ఎప్పటికీ సాధ్యం కాదు. అభ్యర్థులు తమ నైపుణ్యాలను, శక్తిసామర్థ్యాలను, అచీవ్‌మెంట్లను.. ఉన్నది ఉన్నట్లుగా రెజ్యూమ్‌లో పేర్కొంటే ఎలాంటి ప్రశ్నకైనా సులభంగా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది.
 
ఇంటర్వ్యూ చేసేవాళ్లు అందరినీ ఒకే తరహా ప్రశ్నలే అడుగుతారు. ఆ ప్రశ్నలకు ఒక్కో అభ్యర్థి వారివారి శైలిలో సమాధానాలు చెబుతారు. ఆ సమాధానాల ఆధారంగానే ఉద్యోగానికి ఎంపికవుతామో లేదో తేలుతుంది. ఇంటర్వ్యూలో బలాలు, బలహీనతల గురించి చెప్పేటప్పుడు బలహీనతలు లేవని చెప్పడం మంచిది. ఇంటర్యూకు వెళ్లే ముందు సంస్థ గురించి కనీస అవగాహన ఉండాలి. ప్రశ్నలకు లౌక్యం ప్రదర్శిస్తూ సమాధానాలు చెబితే సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువ. మన అనుభవం, నైపుణ్యం, తెలివితేటలు సంస్థకు ఎలా ఉపకరిస్తాయో ఉదాహరణలతో సహా చెబితే ఇంటర్వ్యూలో సులభంగా సక్సెస్ సాధించడం సాధ్యమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: