విజయం మీదే : ఈ విషయాలను గుర్తుంచుకుంటే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar
మనలో చాలామంది బాల్యం నుంచే లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సాధించడానికి అడుగులు వేస్తూ వస్తారు. వాళ్ల మాటలు, చేతలు అన్నీ ఆ దిశగానే సాగుతాయి. ఏ లక్ష్యాన్నైతే నిర్దేశించుకుంటారో దానిని సాధించే వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా వీళ్లు వెనుకడుగు వేయరు. మరి కొంతమంది ఎప్పటికప్పుడు చేతికందుతున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళతారు.
కష్టపడి పనిచేస్తే అవకాశాలు వాటంతటవే తలుపుతడతాయని కొంతమంది నమ్ముతారు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే విజయాలు సులభంగా సొంతమవుతాయి. కొన్ని విషయాలను మనం గుర్తుంచుకుంటే ఏ పనిలోనైనా సులువుగా విజయాన్ని సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. విజయం సాధించాలంటే విజయ శిఖరాగ్రాలను చేరుకున్న అనేకమంది పెద్దల జీవితాల గురించి తీవ్రంగా, చిత్తశుద్ధితో అధ్యయనం చేసి ఓ శాస్త్రీయమైన దృష్టిని అలవర్చుకోవడం అత్యావశ్యకం.
 
విజయం సాధించాలంటే మొదట మనకంటూ స్పష్టమైన లక్ష్యం ఉండాలి. సరైన లక్షాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్యమే మనల్ని విజయం దిశగా అడుగులు వేసేలా చేస్తుంది. సక్సెస్ కు విద్యతో పాటు విజ్ఞానం కూడా అవసరం. మనం ఎంచుకున్న లక్ష్యం గురించి అవగాహన ఏర్పరచుకోవడంతో పాటు లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. మనం ఎంచుకున్న లక్ష్యంపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంచాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సాధ్యమైనంత మేరకు విజయం కోసం శ్రమించాలి. లక్ష్య సాధన కోసం నిరంతరం తపిస్తూ మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి.
నిర్లక్ష్యభావాలను వీడి, లక్ష్యంపై గురిపెట్టి... పట్టుదల సడలకుండా తీవ్రంగా శ్రమిస్తే విజయం ముంగిట వాలుతుంది. లక్ష్యాన్ని సాధించే క్రమంలో అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయడం విజయం సాధించడానికి ఎంతో ముఖ్యం. ఈ విషయాలను గుర్తుంచుకుని సక్సెస్ కోసం ప్రయత్నిస్తే ఏ పనిలోనైనా సులువుగా విజయం సొంతమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: