విజయం మీదే : ఒక్కసారి ఓడిపోయి చూడు గెలుపు విలువేంటో అర్థమవుతుంది

Reddy P Rajasekhar

మనలో ప్రతి ఒక్కరికీ సక్సెస్ అవసరం. గెలుపు ఒక జీవితాన్ని మలుపు తిప్పితే ఓటమి మరపురాని పాఠాలను నేర్పుతుంది. ఒక తెలుగు సినిమాలో “ఎప్పుడూ గెలుపేనా… ఒక్కసారి ఓడిపోయిచూడు... జీవితం నీకింకో కొత్త కోణంలో కనిపిస్తుంది” డైలాగ్ అక్షర సత్యం. ఓటమి మనిషిని సక్సెస్ వైపు పయనించేలా చేస్తుంది. ఓడిన వాళ్లకే గెలుపు విలువ అర్థమవుతుంది. మనలో ఫెయిల్యూర్ ను రెండు విధాలుగా చూసేవాళ్లు ఉంటారు.       
 
ఫెయిల్యూర్ ను కొంతమంది పాజిటివ్ ఫెయిల్యూర్ గా భావిస్తే మరి కొంతమంది మాత్రం నెగిటివ్ ఫెయిల్యూర్ గా భావిస్తారు. ఫెయిల్యూర్ ను పాజిటివ్ గా భావించిన వాళ్లు అప్పటికప్పుడు బాధ పడినా ఆ తర్వాత గెలుపు కోసం మరింత శ్రమిస్తారు. సక్సెస్ సాధించలేకపోవడానికి గల కారణాలను విశ్లేషించుకుని సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటారు. అలా కాకుండా నెగిటివ్ ఫెయిల్యూర్ గా తీసుకుంటే మాత్రం మనకు సక్సెస్ ఎప్పటికీ సొంతం కాదు. 
 
ప్రతి ఒక్కరి జీవితంలో జయాపజయాలు సహజం. అపజయం ఎదురైతే ఒక దారి మూసుకున్నా వంద దారులు మనకు ఆహ్వానం పలుకుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఓటమి వల్ల తాత్కాలికంగా నష్టపోయినా భవిష్యత్తులో ప్రయోజనం చేకూరుతుంది. ఓటమి మనలోని లోపాలను, భయాలను, భ్రమలను నిష్పక్షపాతంగా ఎత్తి చూపిస్తుంది. ఓటమి ఒక ప్రేమ పూర్వకమైన హెచ్చరిక లాంటిది. 
 
ఓటమిని స్వాగతించామంటే మనం చేయబోయే పనిని శ్రద్దగా, నేర్పుగా, పట్టుదలగా చేయబోతున్నామని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం గొప్ప స్థానాల్లో ఉన్న వ్యక్తులంతా ఒకప్పుడు వైఫల్యాలు అనుభవించిన వాళ్లే. మనం నమ్మిన మార్గంలో ధైర్యంగా చేసే ప్రయాణమే గెలుపు. మనం ఓడిపోతే మనవాళ్లు ఎవరో, నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుంది. ఓటమి నిరాశకు కారణం కాకూడదు. ఫెయీల్యూర్ తో గెలుపు వైపు ప్రయాణం మొదలుపెడితే సక్సెస్ తప్పక సొంతమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: