విజయం మీదే : ఓటమికి కుంగిపోకుండా ఒత్తిళ్లను జయిస్తే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

ఓటమి సక్సెస్ కు పునాది. ఓటమికి కుంగిపోకుండా ఒత్తిళ్లను ఎవరైతే జయిస్తారో వాళ్లకు సక్సెస్ తప్పక సొంతమవుతుంది. ఓటమి పొందితే భయపడాల్సిన అవసరం లేదు. ఓటమి ఎదురైతే బాధ పడాల్సిన అవసరం లేదు. వైఫల్యం మనలోని అహాలను, అహంభావాలను తొలగిస్తుంది. ఓటమి నుంచి త్వరగా కోలుకుని సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తే విజయం తప్పక సొంతమవుతుంది. ఈ ప్రపంచంలో ఓడిపోని మనిషి ఎవరూ ఉండరు. 
 
మన జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరువాత విజయం సాధించే చివరి నిమిషం వరకు పోరాడాలి. మనం ఓడిపోయిన సమయంలో గెలుపు విలువ మనకు అర్థమవుతుంది. ఓటమి చెబితేనే గెలుపు పాఠం బాగా అర్థమవుతుంది. మనం జీవితంలో ఎప్పుడూ ఓడిపోలేదంటే గెలవడం కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని లేదా మనకు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఆలోచన లేదని అర్థం చేసుకోవాలి. 
 
ఫెయిల్యూర్ అనేది సూది మందు లాంటిది. సూది వేసిన సమయంలో అప్పటికప్పుడు నొప్పిగానే ఉంటుంది. ఒకటి రెండు రోజులు ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఆ తర్వాత మనకు ఆ వ్యాధి తగ్గుముఖం పట్టి మనం పూర్తిగా ఆరోగ్యవంతులమవుతాం. అలా కాకుండా బాధ పడుతూ కూర్చుంటే మళ్లీమళ్లీ ఓడిపోతూ ఉంటాం. ఇంకా ఇంకా కూరుకుపోతూ ఉంటాం ఓటమికి భయపడినంత కాలం మనం గెలుపును స్వాగతించే ధైర్యం చేయలేం.          
 
మనం ఎంచుకున్న లక్ష్యాన్ని అర్థం చేసుకునే కొద్దీ, శ్రమించే కొద్దీ విజయానికి చేరువవుతాం. ఓటమిని సొంతం చేసుకోలేని వారు విజయాన్ని కూడా సొంతం చేసుకోలేరు. మనం ఏ పనిలోనైనా ఓడిపోయామంటే విజయానికి ఎంతో కొంత చేరువలో ఉన్నామని... సాధించాల్సినంతగా సాధించలేదని.... ఒక దారి మూసుకుపోయిందంటే మరో వంద దారులు తెరుచుకున్నాయని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఓటమికి కుంగిపోకుండా ఎదురయ్యే ఒత్తిళ్లను అధిగమిస్తే విజయం తప్పక సొంతమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: