విజయం మీదే : ప్రశ్నించే గుణం మీలో ఉంటే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar

జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి....? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సందర్భంలో వేధిస్తూ ఉంటుంది. అయితే ఎవరినైతే ఈ ప్రశ్న వేధిస్తోందో వాళ్లకు ఆ ప్రశ్నే సమాధానం కోసం వెతికేలా చేస్తుంది. ఏ సందర్భంలోనైనా మనలో ప్రశ్నించే గుణం ఉంటే విజయం సులభంగా సొంతమవుతుంది. సాధారణంగా పై నుంచి పండు కింద పడితే మనకు దానిని తినాలని తప్ప మరో ఆలోచన రాదు. కానీ న్యూటన్ మాత్రం భిన్నంగా ఆలోచించాడు. 
 
ఆపిల్ పండు కిందకు పడటానికి గల కారణం ఏమిటి....? ఆ పండు పైకి ఎందుకు వెళ్లలేదు....? అనే ప్రశ్నలకు సమాధానం కోసం వెతికి భూమి యొక్క ఆకర్షణ శక్తి గురించి కనుగొన్నాడు. ఇలా జీవితంలో సక్సెస్ సాధించిన ప్రతి ఒక్కరూ ప్రశ్నలకు సమాధానాలను కనిపెట్టి జీవితంలో గొప్పగొప్ప స్థానాలను అధిరోహిస్తున్నారు. మనం కూడా ఈ విధంగా ఎదగాలంటే ఆలోచనల పరిధి కూడా పెరగాలి. 
 
ఆలోచనల పరిధి పెరిగితే మాత్రమే మన జీవితం యొక్క క్వాలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి ప్రశ్న అయినా మన మనస్సు స్పందిస్తుంది. కొన్ని ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తే మరికొన్ని ప్రశ్నలు రెచ్చగొడతాయి. మనిషికి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకునే కుతూహలమే జీవితంలో సక్సెస్ ను తెచ్చిపెడుతుంది. అదే సమయంలో మనం ఇతరులను ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నామో గుర్తించాలి. 
 
శ్రీనివాస రామానుజన్ బాల్యంలో టీచర్ ను సున్నాను సున్నాతో భాగితే ఎంత వస్తుంది....? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నే అతనిని ఉన్నత స్థానాలకు చేర్చింది. జీవితంలో చాలా సందర్భాల్లో మనలోని ప్రశ్నలే మనల్ని ముందుకు నడిచేలా చేస్తాయి. కెరీర్ లో ఉన్నత స్థానాలకు ఎదిగేలా చేస్తాయి. ఏ విషయం గురించైనా ఎందుకు...? ఏమిటి...? ఎలా....? అనే ప్రశ్నల ద్వారా సమాధానం కనుక్కోగలిగే సామర్థ్యం, సత్తా ఉంటే జీవితంలో విజయం సాధించడం సాధ్యమే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: