రేపే న్యూ ఇయర్: చాలా మంది తెలియక చేసే పిచ్చి పని ఇదే..బీ కేర్ ఫుల్..!
ఈ ఏడాది చేసిన తప్పులను వచ్చే ఏడాది చేయకూడదు అని, ఈ సంవత్సరం తప్పనిసరిగా మన జీవితంలో మంచి మార్పులు తీసుకురావాలి అని భావిస్తూ కొందరు ప్రత్యేకంగా ఒక బోర్డ్ తయారు చేసుకుంటారు. అందులో ఈ సంవత్సరం చేయాల్సిన మంచి పనులు, వదిలేయాల్సిన చెడు అలవాట్లు, ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కెరీర్ లేదా వ్యక్తిగత జీవితంలో సాధించాలనుకునే లక్ష్యాలను ఒక నోట్లా రాసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఆ నోట్‌ను గదిలో కనిపించే చోట పెట్టుకుని ప్రతిరోజూ చూసుకుంటూ ఉంటారు కూడా.
అయితే ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఇలా న్యూ ఇయర్ రిసల్యూషన్స్ను ఎంతో ఉత్సాహంగా రాసుకునే వాళ్లలో వంద మందిలో సుమారు 70 శాతం మంది వాటిని అసలు ఫాలో కావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. చాలామంది టైంపాస్ కోసం లేదా ట్రెండ్‌లో భాగంగా మాత్రమే ఆ రిసల్యూషన్స్ రాసుకుంటారు. కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచే వాటిని మర్చిపోతారు. ఇక మిగిలిన 30 శాతం మంది అయినా పూర్తిగా ఆ నిర్ణయాలను పాటిస్తున్నారా అంటే, దానికి కూడా “నో” అనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. కొంతమంది కేవలం మొదటి కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు మాత్రమే వాటిని పాటించి, తర్వాత మళ్లీ పాత అలవాట్లలోకి వెళ్లిపోతుంటారు.
ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది జనాలు ఘాటుగా సలహాలు ఇస్తున్నారు. “రిసల్యూషన్స్ అనేవి న్యూ ఇయర్ లేదా ఇంకేదైనా ప్రత్యేక సందర్భం కోసం తీసుకునే నిర్ణయాలు కావు. మీరు మీ జీవితాన్ని నిజంగా ప్రేమిస్తే, మీ ఆరోగ్యం పట్ల, మీ భవిష్యత్తు పట్ల ప్రతి రోజూ జాగ్రత్తలు వహిస్తే, అసలు న్యూ ఇయర్ రిసల్యూషన్స్ అనే కాన్సెప్ట్ అవసరమే లేదు” అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి చిన్న విషయానికి ట్రెండ్‌ను ఫాలో అవ్వడం ఆపండి అని కూడా వారు సూచిస్తున్నారు. ఎందుకంటే కొంతమంది రిసల్యూషన్స్ పేరిట అనవసరమైన నియమాలు తమ మీద తాము విధించుకుంటూ ఉంటారు. ఉదాహరణకు, అకస్మాత్తుగా డైట్ మార్చడం, అతిగా వర్కౌట్స్ చేయడం, శరీరానికి సరిపోని లక్ష్యాలు పెట్టుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ సరైన మార్గదర్శకత లేకుండా చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ రిసల్యూషన్స్పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరు రిసల్యూషన్స్ అవసరమే అని అంటుంటే, మరికొందరు అవి కేవలం ఒక ట్రెండ్ మాత్రమే, నిజమైన మార్పు మన ఆలోచనల్లో, రోజువారీ అలవాట్లలో ఉండాలని వాదిస్తున్నారు. అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో న్యూ ఇయర్ రిసల్యూషన్స్కు సంబంధించిన పోస్టులు, మీమ్స్, చర్చలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి, కొత్త సంవత్సరం అనేది కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు. నిజంగా మార్పు కావాలంటే అది ఒక్కరోజు నిర్ణయంతో కాదు, ప్రతిరోజూ మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాల వల్లే సాధ్యమవుతుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2026వ సంవత్సరం అయినా, రిసల్యూషన్స్ అనే మాటకే పరిమితం కాకుండా, నిజమైన జీవన మార్పుకు నాంది పలకాలని చాలామంది ఆకాంక్షిస్తున్నారు.