75ఏళ్లుగా నిమజ్జనానికే నోచుకోని గణనాధుడు.. ఎక్కడో తెలుసా..?

FARMANULLA SHAIK
వినాయక చవితి వస్తే చాలు.. ఊరూరా.. వాడ వాడలా వినాయక మండపాలు దండిగా దర్శనమిస్తాయి. తీరొక్క రూపాల్లో రంగు రంగుల వెలుగుల్లో అంతకు మించిన అలంకరణలతో డీజేలో మోతాల్లో కనిపిస్తాయి గణనాథుడి మండపాలు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు.. ఒకే గ్రామం ఒకే మండపం ఒకే దేవుడు అన్నట్టుగా సమిష్టితత్వానికి గుర్తుగా.. ప్రకృతి పుత్రుడు కొలువుదీరుతాడు.తొలిపూజలు అందుకునే ఆది దేవుడిగా, విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిగా, సర్వశుభాలను కలిగించే శివతనయుడిగా... గణనాథుడికున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అందుకే ఏ ఆలయానికి వెళ్లినా... మొదట వినాయకుడినే దర్శించుకుంటాం. ఇక, దేశవ్యాప్తంగా ఉన్న గణపతి ఆలయాలకు లెక్కే లేదు. కాణిపాకం, లాల్‌బాగ్‌... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఈ గణేశుడి ఆలయం కాస్త ప్రత్యేకం. ఎందుకంటే...అన్ని ఆలయాల్లోలా కాకుండా... వినాయకచవితి ఉత్సవాలు మొదలైతేనే ఆ గుడిలో గణనాథుడు పూజలందుకుంటాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మాత్రమే వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు. పైగా ఈ గణేశుడి మరో ప్రత్యేకత ఏంటంటే అది చెక్కతో చేసిన విగ్రహం. ఇదంతా నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలం సరిహద్దుల్లో మహారాష్ట్రలోని పాలజ్‌ గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి కర్ర వినాయక దేవాలయం సంగతి. ఎక్కడైనా ఏటా వినాయకచవితి సంబురాలు ముగియగానే వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటారు. కానీ ఈ ఆలయంలోని వినాయకుణ్ని మాత్రం చవితి వేడుకలు పూర్తవ్వగానే ఊరేగింపు జరిపి నీళ్లు చల్లి దాన్ని భద్రపరుస్తారు. మళ్లీ వినాయక చవితికే ప్రతిష్ఠిస్తారు. దాదాపు 75 ఏళ్ల నుంచి ఈ ఆనవాయితే ఇక్కడ కొనసాగుతూ వస్తోందట. ఏటా ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి వేలాది భక్తులు బారులు తీరుతారు, కోరిన కోరికలు తీరుస్తాడని నమ్ముతారు.

దేశానికి‌ స్వాతంత్ర్యం సిద్దించిన తొలి నాళ్లలలో ఈ కర్ర గణనాథునికి ప్రాణప్రతిష్ఠ జరగగా.. 75 ఏళ్లుగా చక్కు చెదరకుండా భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలుస్తున్నాడు పాలజ్ గణపతి.ఈ నేపథ్యంలో 1948 లో తొలిసారి ఈ కర్రగణపతిని విగ్రహాన్ని ప్రతిష్టించారు పాలజ్ మండప నిర్వహకులు. ఆ ఏడాది గ్రామంలో అంటువ్యాధులు ప్రబలి సుమారు 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలోనే వినాయక చవితి పండగ రావడంతో.. ఆ మహమ్మారి బారి నుండి రక్షించు గణపయ్యా అంటూ గ్రామంలో వినాయకుని ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నారంట పాలజ్ గ్రామస్తులు. అనుకున్నదే తడువుగా విగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారంట.మట్టితో చేసిన గణనాథుడిని కాకుండా కర్రతో గణపతిని చేయించాలని సంకల్పించి.. నిర్మల్ కు చెందిన పాలకొండ గుండాజీ వర్మను సంప్రదించి కర్ర గణపతి విగ్రహాన్ని తయారు చేయాలని కోరారంట. నిష్ఠతో కర్ర గణపతిని చెక్కిన గుండాజీ అనుకున్న సమయానికంటే ముందే నిర్వహకులు గణనాథుని విగ్రహాన్ని అందించడం.. పాలజ్ వాసులు ఓ చిన్న కుటీరంలో ప్రతిష్టించి నవరాత్రులు భక్తి శ్రద్దలతో పూజించడం జరిగింది. దాంతో వెంటనే ఆ ఏడాది అంటువ్యాధులు పూర్తిగా మటుమాయం కావడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారట.
దీంతో ఆ కర్ర గణపతిని నిమజ్జనం చేయకుండా జాగ్రత్తగా భద్రపరిచి.. మళ్లీ వినాయక చవితికి బయటకు తీసి పూజలు నిర్వహించారంట. అలా ఏడాదికి ఏడాది గణనాథుడి ఆశీర్వాదంతో గ్రామం అభివృద్ది వైపు పరుగులు తీయడం.. కుగ్రామం కాస్త పట్టణంగా మారడం.. కర్ర గణపయ్య కొలువుదీరిన కుటీరం కాస్త ఆలయంగా అభివృద్ది చెందడం జరిగింది. 75 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయని పాలజ్ గ్రామస్తులు చెప్తున్నారు.ఇదిలావుండగా వినాయక నవరాత్రులు‌ ఒక‌ ఎత్తైతే.. శోభయాత్ర మరో ఎత్తు. దేశమంతటా.. వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా డీజే మోతలతో డ్యాన్సులతో యువత హంగామా తారస్థాయిలో కనిపిస్తుంటుంది. కానీ ఇక్కడి కర్ర గణనాథుల నిమజ్జన్నం మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఉత్సవాలలో భాగంగా పదకొండు రోజుల విశేష పూజల తర్వాత పాలజ్, తానూర్ , చిక్లీ , బోని గ్రామాలలో కొలువుదీరిన కర్ర లంబోదరుణ్ణి ఊరేగించి ఒక ప్రత్యేక గదిలో భద్రంగా ఉంచడం ఇక్కడ ఆనవాయితీ. ఈ మూడు గ్రామాల్లో కొలువు దీరిన కర్ర గణనాథులకు అన్ని గణనాథుల వలే నిమజ్జనం మాత్రం ఉండదు.. 11 వ రోజు కర్ర గణనాథుడిని రథంపై ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించడం.. అనంతరం మహాదేవుని‌ విగ్రహం పై నీళ్లు చల్లి భద్రపరచడం ఆనవాయితీ.ఈ శోభయాత్ర వేళ హరి కీర్తనలు , భజనలు తప్ప డీజే మోతలు అస్సలు కనిపించవు. సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంలాగా ఇక్కడి నిమజ్జన ఊరేగింపు కనువిందు చేస్తుంటుంది. ప్రతి రోజూ బ్రహ్మ ముహుర్తాన స్వామి వారి కాకడ హారతి, మధ్యాహ్నం గీత ప్రవచనం, రాత్రి కీర్తనలు, జాగరణలు, భజనలతో కోలాహలంగా కనిపిస్తాయి కర్ర గణనాథుడి కొలువైన ఈ మూడు గ్రామాల మండపాలు. ఈ‌ఏడాది కూడా ముచ్చటగా కొలువుదీరి మూడు జగాలను ఆశీర్వదిస్తూ ముక్కోటి పూజలందుకుంటున్నాడు కర్ర గణనాథుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: